డిమాండ్‌లో వెనక్కి తగ్గిన నటుడు శేఖర్ సుమన్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనంతగా వివాదాలు చెలరేగాయి. అతడి మరణానికి బాలీవుడ్ మాఫియా కారణమని… దావూద్ అనుచరుల బెదిరింపులు కారణమని.. పరిశ్రమలో నెప్టోయిజం.. కుటుంబ పాలనే కారణమని కూడా వాదనలు వినిపించాయి.
పోలీసులు ఆత్మహత్య అని ధృవీకరించినా సుశాంత్ సింగ్ మరణంపై పలు సందేహాలు అలానే ఉన్నాయి. ముఖ్యంగా అభిమానులు సహా సాటి నటీనటులు రకరకాల సందేహాల్ని లేవనెత్తారు. సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన వారిలో సహనటుడు శేఖర్ సుమన్ ఉన్నారు. ఆయన ప్రత్యేకించి దీనిపై అభిమాన సంఘం ప్రారంభించి యుద్ధమే చేశారు. ఇప్పటికీ వార్ నడిపిస్తున్నారు. కానీ ఇంతలోనే ఈ ఉద్యమం చప్పున చల్లారిపోయింది.
తనంతట తానుగానే ఈ ఉద్యమం నుంచి వైదొలగుతున్నానని శేఖర్ సుమన్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడం వేడెక్కిస్తోంది. ఇంతకీ ఏమైంది? అన్నది ఆరా తీస్తే.. అసలు సుశాంత్ సింగ్ కుటుంబం పూర్తిగా మౌనంగా ఉంది. తనకు అది ఇబ్బందికరంగా ఉందని.. ఏమాత్రం సహకారం లేదని ఆవేదన చెందారు. అందుకే వారి గౌరవం కాపాడేందుకు తాను విరమించుకుంటున్నానని శేఖర్ సుమన్ వెనకడుగు వేశారు. నిజానికి సుశాంత్ సింగ్ కుటుంబీకుల కంటే అభిమానులే సీబీఐ దర్యాప్తు విషయంలో పంతంతో ఉన్నారు. కుటుంబీకులు ప్రస్తుతం ఆ మరణాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఎవరిపైనా ఫిర్యాదు చేసే ఆలోచనతో లేరని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.