ఏపీలో మద్యంపై సీబీఐ దర్యాప్తు.! కామెడీ కాకపోతే ఏంటి.?

నిజానికి, ఈ రోజుల్లో దేన్నీ కామెడీగా చూడాల్సిన పనిలేదు.! చిన్న చిన్న విషయాలే, చాలా పెద్ద పెద్ద వ్యవహారాలుగా మారిపోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. ఢిల్లీలో తీగ లాగితే, తెలంగాణలో డొంక కదిలిన వైనాన్ని చూశాం.

అంతెందుకు, ఈ స్కామ్ వ్యవహారంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పేరుని కూడా లాగింది తెలుగుదేశం పార్టీ.! స్కాముల వ్యవహారాలు ఇలా వుంటాయి. ఏమీ లేని కేసు.. అంటూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి టీడీపీ అంచనా వేస్తే, నెల రోజులైనా జైలు నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు బయటకు రాలేని పరిస్థితులు వచ్చాయి.

ఇక, అసలు విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఈ మేరకు ఆమె ఫిర్యాదు కూడా చేసి వచ్చారట. సీబీఐ, కేంద్రం కనుసన్నల్లోనే పనిచేస్తుందన్నది బహిరంగ రహస్యం.

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వున్నప్పుడూ, ఏపీ లిక్కర్ విషయమై నానా రకాల ఆరోపణలూ చేశారు. కానీ, బీజేపీ జాతీయ నాయకత్వం పట్టించుకోలేదు. కేంద్రమూ చూసీ చూడనట్టు వ్యవహరించింది. ఇప్పుడు పురంధీశ్వరి ఫిర్యాదు విషయంలోనూ అదే జరుగుతుందా.?

సీబీఐ విచారిస్తున్న కేసుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది ఇంకా హాస్యాస్పదమైన వ్యవహారం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీ ఇంకా తేలలేదు. ఆ కేసు అలా అలా సాగుతూనే వుంది. అలాంటి సీబీఐతో, ఏపీ లిక్కర్ వ్యవహారాన్ని విచారణ చేయించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్ చేయడమంటే.. నవ్వాలా.? ఏడవాలా.?