సుశాంత్ ఆక‌స్మిక మ‌ర‌ణం మిస్ట‌రీయేనా? సీబీఐ ద‌ర్యాప్తు?

                                అభిమానుల్లో ఊపందుకున్న డిమాండ్!

బిహారీ అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ ఆరంగేట్రం అక్క‌డ స‌క్సెస్ స‌హా ప్ర‌తిదీ ఆస‌క్తిక‌రం. ఎలాంటి సినీనేప‌థ్యం లేకుండానే ఇంతింతై అన్న చందంగా అత‌డు ఎదిగిన వైనం ఎంద‌రో యువ‌త‌రానికి స్ఫూర్తి. సాక్షాత్తూ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అత‌డి మ‌ర‌ణాన్ని అంగీక‌రించ‌లేక‌పోయారంటే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎం.ఎస్.ధోని యాన్ అన్ టోల్డ్ స్టోరి చిత్రంతో అత‌డు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన వ‌ర్థ‌మాన న‌టుడిగా సుశాంత్ సింగ్ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువున్నాడు.

అలాంటి ప్ర‌తిభావంతుడైన ఒక హీరో ఆక‌స్మికంగా మ‌ర‌ణించాడు! అన్న‌ది అభిమానులే కాదు ఎవ‌రూ జీర్ణించుకోలేనిది. అందుకే ఇప్ప‌టికీ అత‌డి ఆత్మ‌హ‌త్య‌పై సందేహం వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది. 2020 జూన్ 14 న సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఎన్నో అనుమానాల‌కు తావిచ్చింది. అత‌డి చుట్టూ ఒక ప్ర‌మాద‌క‌ర వ‌ల‌యం వ‌ల ప‌న్ని హ‌త‌మార్చింద‌నే అభియోగం ప‌దే ప‌దే వినిపిస్తూనే ఉంది. అభిమానులు బంధు మిత్రులు ఇప్ప‌టికీ సీబీఐ ద‌ర్యాప్తు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ కేసులో ప్రియురాలు రియా చక్ర‌వ‌ర్తి స‌హా ఆమె సోద‌రుడు స‌యీక్ చ‌క్ర‌వ‌ర్తిని కూడా పోలీసులు విచారించారు. రియా సోదరుడితో క‌లిసి సుశాంత్ ఓ కార్పొరెట్ కంపెనీని నిర్వ‌హిస్తుండ‌డం అందులో ఆర్థిక లావాదేవీల్లో ఏదైనా మ‌త‌ల‌బు ఉందా? అన్న కోణంలోనూ పోలీస్ విచార‌ణ సాగుతోంది.

ఇదిలా ఉండ‌గానే.. రియా చ‌క్ర‌వ‌ర్తి కి మ‌హేష్ భ‌ట్ లాంటి సినీపెద్ద‌తో ఎఫైర్ ఉండ‌డం అన్న‌ది ప్ర‌ధానంగా హైలైట్ అయ్యింది. దీనిపైనా ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఆ కోణంలోనూ పోలీసుల ద‌ర్యాప్తు సాగుతోంది. అందుకే.. ఇప్ప‌టికీ సుశాంత్ అభిమానులు సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సిందేనంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ని ట్విట్ట‌ర్ లో వైర‌ల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం #CBIMustForSushant  గూగుల్ ట్రెండింగ్ లో ఉంది. గాయ‌కుడు సోనూ నిగ‌మ్ వంటి వారు అండ‌గా నిల‌వ‌డంతో ఈ హ్యాష్ ట్యాగ్ కి మ‌రింత ప్రాచుర్యం ల‌భిస్తోంది.