సుకుమార్‌తో ఛాన్స్.. లక్కీగాళ్ కన్ఫామైందట
అక్కినేని కోడలు సమంత తన కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా సుకుమార్ రూపొందించిన `రంగస్థలం` చిత్రంలోని రామలక్ష్మి పాత్ర ఎంతో ప్రత్యేకం. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన రోల్ ఇది. అచ్చం పదహారణాల పల్లె పడతిలా రామలక్ష్మి పాత్రలో సమంత ప్రదర్శించిన అభినయం ఆమె కెరీర్‌లోనే హైలైట్. అలాంటి పాత్ర ఆమెకు మళ్లీ వస్తుందో రాదో తెలియదు కానీ అదే స్థాయి పాత్రని మాత్రం కన్నడ కస్తూరి రష్మిక మందనను వరించబోతోంది. `ఛలో`, గీత గోవిందం చిత్రాలతో తెలుగులో రష్మిక తనదైన ముద్ర వేసింది. ఆమె సినిమా అంటే ఎంతో కొంత ప్రత్యేక క్రేజు తెలుగు ప్రేక్షకుల్లో ఏర్పడింది. కళ్లతోనే కోటి భావాల్ని పలికించే ట్యాలెంటెడ్ బ్యూటీగా యువతరం వోన్ చేసుకున్నారు.
ఈ క్రేజ్‌ని గ్రహించిన సుక్కు వెంటనే తన తదుపరి చిత్రం కోసం రష్మిక ను లాక్ చేశాడని ఆరంభమే వార్తలొచ్చాయి. అయితే అప్పటికి అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. తాజాగా రష్మికకే ఆ ఛాన్సు ఉంటుందని సుకుమార్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ మూవీ అంతా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రామలక్ష్మిని తలపించే పదహారణాల పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందన్న కనిపించనుందని తెలిసింది. `రంగస్థలం` తరవాత సుక్కు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఏ విషయంలోనూ సుక్కు తగ్గడం లేదు.