సెట్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధ‌మైన స‌మంత‌.. ఇక సంద‌డే సంద‌డి

అక్కినేని కోడ‌లు స‌మంత పెళ్లి త‌ర్వాత త‌న రూటు మార్చేసింది. సెల‌క్టివ్‌గా పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇన్నాళ్లు గ్లామ‌ర్ పాత్ర‌లతో అల‌రించిన స‌మంత ఇప్పుడు ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు ఓటు వేస్తుంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంతలం అనే దృశ్య‌కావ్యాన్ని చేయ‌బోతున్న‌ట్టు కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించింది. ఈ సినిమాకు సంబంధించి గ‌త కొద్ది రోజులుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా, మూవీని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ‌తారా అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

మార్చి 20 నుండి శాకుంత‌లం సినిమా షూటింగ్ జ‌ర‌ప‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే స‌మంత బ‌ల్క్ డేట్స్ గుణశేఖ‌ర్ తీసుకోగా, రానున్న రోజుల‌లో ఆమెతో ఎక్కువ రోజులు షూటింగ్ జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. త‌న కెరీర్‌లో స‌మంత తొలిసారి పౌరాణిక చిత్రం చేస్తుంది. దీంతో అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. శ‌కుంత‌ల‌గా స‌మంత న‌టిస్తుండ‌గా, దుశ్యంతుడి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై అప్‌డేట్ రావ‌ల‌సి ఉంది. రుద్రమదేవి తర్వాత సినిమాలు చేయని చేయ‌ని గుణ‌శేఖ‌ర్ ఇప్పుడు సమంతతో తన గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పైనే సినిమా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

జాను చిత్రం త‌ర్వాత స‌మంత సైన్ చేసిన తొలి సినిమా ఇదే కాగా, ఈ మూవీ కోసం అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రి ఎదురు చూస్తున్నారు. మార్చిలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంద‌ని టాక్. గ‌త కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రిపించిన గుణ‌శేఖ‌ర్ రీసెంట్‌గా వాటిని పూర్తి చేశాడు. ఇక సినిమా తెర‌కెక్కించ‌డ‌మే త‌రువాయి. ఈ సినిమా త‌ర్వాత గుణ‌శేఖర్ ..రానా దగ్గుబాటితో హిరణ్య కశ్యప కూడా చేయ‌నున్నాడు. ఈ సినిమా 2022లో పట్టాలెక్కనుంది. కాగా, స‌మంత ఇటీవ‌ల సామా్ జామ్ అనే షోతో అల‌రించిన విష‌యం తెలిసిందే. ఈ షోకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లోను న‌టించ‌గా, ఇది స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.