ఇంతకు మునుపు దాక ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువనే ఆరోపణ ఉండేది. మలయాళం, హిందీ, పంజాబీ అంటూ పర భాషల నటీమణుల్ని విపరీతంగా ప్రోత్సహించేవారు. స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న వాళ్ళంతా బయటివాళ్లే. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ అవ్వాలనే ఆసక్తి తక్కువని, అందుకే బయట వెతుక్కుంటున్నామని ఈ ఆరోపణకి సమాధానం ఇచ్చేవాళ్ళు చాలామంది. అందులో కొంతవరకు నిజం లేకపోలేదు. అయితే ఇప్పుడు ఇదే పరిస్థితి తెలుగు యువ హీరోలకు ఎదురవుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరోలను పక్కనబెట్టి పర భాషల నుండి కుర్రాళ్లను తెచ్చుకుంటున్నారు మన ఫిల్మ్ మేకర్స్. తాజాగా సమంత కథానాయకిగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే పిరియాడికల్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్ర కోసం మలయాళ నటుడు దేవ్ మోహన్ ను తీసుకొచ్చారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ సరసన తెలుగు యువ హీరోల్లో ఎవరైనా నటిస్తారని అనుకుంటే గుణశేఖర్ ఇలా మలయాళం నుండి నటుడ్ని తెచ్చుకోవడం నిరాశ కలిగించే విషయమే.
ఫైనల్ డెసిషన్ దర్శక నిర్మాతలదే, వారికి ఇష్టం వచ్చిన వారినే తీసుకునే స్వేచ్ఛ వారికి ఉంది. కానీ తెలుగులో ఈమధ్య కాలంలో బోలెడంతమంది యువ హీరోలు వచ్చారు. చక్కగా రాణిస్తున్నారు. మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. వారిలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాల్సింది పోయి ఇలా మలయాళ నటుడ్ని తీసుకోవడమే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సరే.. బిజినెస్ పరంగా ఆలోచించి అక్కడ కూడ రీచ్ ఉండాలని అలా చేశారులే అనుకుందామన్నా దేవ్ మోహన్ చేసింది ఒకే ఒక్క సినిమా. అతనేమీ స్టార్ హీరో కాదు. అలాంటప్పుడు ఇక్కడి వారినే తీసుకుంటే సొంత ఇలాకాలో బిజినెస్ ఇంకా మెండుగా ఉండేది కదా. పైగా అంత మంచి సినిమాలో నటిస్తే మన కుర్రాడే ఇంకో మెట్టు పైకెక్కే అవకాశం ఉండేది.