‘ఈటీవీ’ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌నంటూ మహిళ మోసం, అరెస్ట్

తాను తెలుగులో వస్తున్న ప్రముఖ టీవి ఛానల్ ఈటీవీ కు ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ని అంటూ పలువురిని నమ్మించి మోసం చేసిన ఓ మహిళ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమాలు, సీరియళ్లలో నటించేందుకు అవకాశం కల్పిస్తామంటూ నకిలీ ఫేస్‌బుక్ ఖాతాతో మోసాలకు పాల్పడుతున్న శ్రీలత అనే మహిళను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. తుమ్మల శ్రీదేవి పేరుతో ఆమె నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించింది.

ఫేస్‌ బుక్‌ లో తుమ్మల శ్రీదేవి పేరిట తప్పుడు ఖాతా తెరిచింది. చాన్స్ ల కోసం చూస్తున్న వారిని పరిచయం చేసుకుని వంచించడమే ఆమె పని. వంశీ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీలత ను అరెస్ట్ చేశారు. తన వద్ద నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్టు వంశీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. చిత్తూరు జిల్లా చింతపర్తికి చెందిన శ్రీలత అలియాస్‌ శ్రీదేవి అలియాస్‌ సుష్మిత సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఒక్క అవకాశం ఇప్పిస్తానంటూ ఎంతో మంది నుంచి లక్షల్లో నొక్కేసినట్లు బయిటపడింది.

ఆమె నడుపుతున్న ఫేక్ ప్రొఫైల్ గురించి తెలుసుకున్న సదరు టీవీ చానల్, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఆధారాలను సేకరించారు. శనివారం శ్రీలతను అరెస్ట్ చేసి విచారించగా, ఇవే తరహా నేరాలను ఆమె ఎన్నో చేసినట్టు తేలింది. శ్రీలతను రిమాండ్ కు పంపనున్నామని పోలీసులు వెల్లడించారు.

2017లోనూ శ్రీలత మ్యాట్రిమోనీ పేరుతో ఓ యువకుడిని మోసం చేసి అరెస్టైంది. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో తప్పుడు ప్రొఫైల్స్ పెట్టి, ఎంతో మంది నుంచి డబ్బులు కాజేసిన ఆమె, 2017లో జైలుకు వెళ్లి, బెయిల్ పై వచ్చిన శ్రీలత, మళ్లీ ఇలా సైబర్‌ నేరాలకు తెరతీసింది.