వడివేలు కు గూబ గుయ్యిమనిపించాడు

ప్రముఖ నటుడు వడివేలు టైమ్ బాగున్నట్లు లేదు. తన నోటి దురదతో అందరినీ దూరం చేసుకుంటున్నారు. అప్పట్లో రజనీ మీద కామెంట్స్ చేసి చాలా కాలం ఇండస్ట్రీకు దూరంగా బ్రతికాడు. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతాడనుకుంటే దర్శకుడు శింబు దేవన్‌ను తప్పుపడుతూ ఇటీవల వ్యాఖ్యలు చేసాడు. అయితే ఒకరిని అనగానే సరా..వెంటనే కౌంటర్ కూడా పడుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడదే జరిగింది.

వివరాల్లోకి వెళితే…వడివేలు హీరోగా శింబు తీసిన సినిమా ‘ఇంసై అరసన్‌ 24 ఏఎం పులికేసి’. భిన్నాభిప్రాయాల కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఆగిపోయింది. శింబు తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని, బలవంతంగా ముందుకు తోస్తున్నాడని వడివేలు అన్నారు. తనులేకుండా సినిమాను పూర్తి చేయలేరని చెప్పారు.

అయితే దీనిపై శింబు సహాయ దర్శకుడు, ‘మూదర్‌ కూదమ్‌’ దర్శకుడు నవీన్‌ స్పందించారు. వడివేలు తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ‘సెట్‌లో నటన పరంగా మీ నైపుణ్యం అంటే నాకు ఎంతో ఇష్టం. మీరు ఓ నటుడిగా నిజాయితీగా ఉంటారు. హాస్యాన్ని బాగా పండించగలరు.

అంతేకానీ మొత్తం సినిమా స్క్రిప్టును మీరు రాయలేరు (కథలో మార్పులు చేయమని వడివేలు కోరడాన్ని ఉద్దేశిస్తూ). ‘ఇంసై అరసన్’ సినిమా విజయానికి నిజంగా మీరు కారణం అయితే.. మీరు హీరోగా నటించిన మిగిలిన భారీ బడ్జెట్‌ సినిమాలు ఎందుకు ఫ్లాప్‌ అయ్యాయి?’ అంటూ ప్రశ్నించారు.