రాజమౌళి చెప్పాడనే ..ఓకే చేసిన శ్రియ!?

స్టార్స్ ఒక్కొక్కరూ మెల్లిగా వెబ్ సీరిస్ వైపు జర్నీ మొదలెడుతున్నారు. అయితే సినిమాల్లో బిజీగా ఉండేవాళ్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపెట్టడం లేదు. కానీ సీనియర్స్ మాత్రం తమ నెక్ట్స్ మజిలీ అన్నట్లుగా ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తోడు రానా వంటి యంగ్ హీరోలు సైతం వెబ్ సీరిస్ లు చేస్తూంటే తాము ఎందుకు వెనకబడాలని మరికొందరు భావిస్తున్నారు. అయితే ఆ వెబ్ సీరిస్ ని నిర్మించే సంస్ద, ప్రాజెక్టు క్రేజ్ ని బట్టి కూడా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు శ్రియ వంతు.

హీరోయిన్‌గా దాదాపు ప‌దేళ్లు పైగా జ‌ర్నీని కొన‌సాగిస్తున్నా.. చెక్కు చెద‌ర‌ని ఫిటెనెస్ తో కెరీర్ ని లాక్కొస్తోంది. అందుకు కారణం …ఆమె అందంతో పాటు…, పెర్ఫామెన్స్‌తో న‌టిగా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకోవటమే అంటారు ఆమె అభిమానులు. అయితే శ్రియ రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర్వాత కూడా ఈమె న‌టించ‌డానికి సిద్ధ‌మైంది.

ఇన్నాళ్లూ అదరించిన ఇండస్ట్రీనే … శ్రియకు అవ‌కాశాలు ఇస్తోంది. తాజాగా శ్రియ వెబ్ సిరీస్‌ కమిటైంది. ఆమె న‌టించ‌బోయే వెబ్ సిరీస్ `ది రైజ్ ఆఫ్ శివ‌గామి`. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన బాహుబలి చిత్ర కథకు ప్రీక్వెల్ గా ఈ కథ నడవనుంది.

ఇందులో మృణాల్ ఠాకూర్ శివ‌గామి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఓ కీల‌క పాత్ర‌లో శ్రియ న‌టించ‌నున్నారు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో శ్రియ న‌ట‌నే ఈ వెబ్ సిరీస్‌లో ఆమె ఎంపిక‌కు కార‌ణమ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. అయితే శ్రియ మొదట ఈ వెబ్ సీరిస్ లో నటించటానికి ఓకే చేయలేదట. కానీ రాజమౌళి ఫోన్ చేసి ..మంచి క్యారక్టర్ అని చెప్పటంతో ఓకే చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఫస్ట్ పార్ట్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కొన్ని ఎపిసోడ్ ల తర్వాత మిగిలిన వాటికి ప్రస్థానం ఫేం దేవకట్టా దర్శకత్వంలో జరగనున్నట్లు తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను దాదాపు వందకోట్ల బడ్జెట్ తో చాలా రీచ్ గా ప్లాన్ చేస్తున్నరట నిర్మాత.బాహుబలి సెల్యులాయిడ్ చిత్రాల కోసం వేసిన సెట్స్ ను యథాతథంగా వాడుకుంటూనే అంతకు ముందు కథను వివరించడానికి అవసరమైన మరికొన్ని సెట్స్ ని సెపరెట్ గా నిర్మించినట్టు తెలుస్తోంది.