షకీలా బయోపిక్ లో ఆ షాకింగ్ నిజం..స్టార్ హీరోనే టార్గెట్?

మలయాళ ఇండస్ట్రీలో ఓ టైమ్ లో స్టార్ హీరోలకు సైతం గట్టి పోటి ఇచ్చిన షకీలా జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘షకీలా నాట్‌ ఏ పోర్న్‌ స్టార్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి రిచా చడ్డా టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. మలయాళ దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజై హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో ఏం చూపెట్టనున్నారనే విషయం అందరిలో ఆసక్తికర అంశమైంది.

అందుతున్న సమచారం ప్రకారం ఈ సినిమాలో షకీలా వ‍్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌. ముఖ్యంగా షకీలా అడల్ట్ స్టార్ గా మారడానికి గల కారణాలు, అప్పటి ఆమె ఫ్యామిలీ పరిస్దితులు తెరపై చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయట.

ఇప్పటివరకూ బయిటకు రాని కొన్ని పర్శనల్ విషయాలు సైతం ఈ సినిమాలో ప్రస్దావించనున్నారట. ముఖ్యంగా అప్పటి హీరో ఒకరి గురించి ఓ సినిమాలో కొన్ని నిజాలు బయిటపెట్టనున్నారట. ఆయన తన సినిమాలకు అడ్డు వస్తోందని షకీలాని బెదరించటం, సినిమాలు ఆపేయటం వంటివి చేసారట. ఆ విషయాలన్ని ఈ సినిమాలో ప్రస్తావించనున్నారట. అయితే హీరో ఎవరనేది డైరక్ట్ గా చెప్పరని, మళయాళ సినిమాలు ఫాలో అయ్యేవారికి స్పష్టంగా అర్దమవుతుందని తెలుస్తోంది.

కాగా ఈ మూవీలో అతిథి పాత్ర‌లో న‌టించ‌వ‌ల‌సిందిగా ష‌కీలాను ద‌ర్శ‌కుడు ఇటీవ‌ల కోరిన‌ట్లు స‌మాచారం. దీనికి ష‌కీలా అంగీకారం తెలిపిన‌ట్లు తెలుస్తోంది.

తొంభైవ దశకంలో ఆమె సినిమాలకు యమ క్రేజ్‌ ఉండేది. ఒకానొక దశలో ఆమె సినిమా కలెక్షన్ల ముందు బడా స్లార్ల మూవీల కలెక్షన్లు కూడా వెలవెలబోయేవి. షకీలా మూవీ రీలీజ్‌ అవుతుందంటే చాలు.. వారం రోజుల పాటు బడా హీరోల సినిమాలు వాయిదా పడేవి. ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది.