శంకర్ ‘ఇండియన్ 2’.. ఇక మొదలైతే ఆగదట!

ఇండియన్ టాప్ దర్శకుల్లో ఒకరైన శంకర్ లక్కేమిటో గాని ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలకు చాలా సమస్యలు ఎదురువుతున్నాయి. శంకర్ అనగానే బిగ్ బడ్జెట్ సినిమాలు అని అందరికి తెలిసిందే. ఆయన కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా కూడా నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. అయితే 2.ఓ అనంతరం ఆయన క్రేజ్ కాస్త తగ్గిందనే కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ తో మొదలు పెట్టిన ఇండియన్ 2కు ఊహించని విధంగా సమస్యలు ఎదురవుతున్నాయి.

మొదట్లోనే అనుకున్న బడ్జెట్ ను కొంచెం తగ్గించగా ఆ తరువాత సినిమా షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ కు ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం కరోనా కారణంగా మరోసారి లాంగ్ గ్యాప్ ఏర్పడింది. ఇక ఎట్టకేలకు షూటింగ్స్ మొదలవ్వగా శంకర్ కూడా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ లైకా మళ్ళీ బడ్జెట్ విషయంలో కాస్త విబేధించడంతో ఎప్పటిలానే బ్రేక్ పడింది. ఇక శంకర్ అసహనంతో మరో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసుకుంటానని చెప్పడంతో ఇటీవల లైకా నిర్మాతలు ఒక మెట్టు దిగి మ్యాటర్ ను సెటిల్ చేశారు.

షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శంకర్ తన టీమ్ ను కలిసి షెడ్యూల్ ను ప్లాన్ చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ అనే సినిమాతో బిజీగా ఉండడం వలన అది అయిపోగానే ఫిబ్రవరి చివరివారంలో ఇండియన్ 2 షూటింగ్ ను మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఇక సినిమాను 2022లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.