అన్నీ ఫ్లాపులే.. అయినా కుర్ర హీరో హవా ఏంటో!!
వరుసగా ఫ్లాపులొస్తున్నా ఛాన్సులకు కొదవేం లేదు. అసలు ఇదెలా సాధ్యం? ఒక్క ఫ్లాప్‌తోనే అడ్రెస్ లేకుండా గల్లంతయిపోతున్నారు. అలాంటిది ఈ యంగ్ హీరో ఎలా నిలదొక్కుకుంటున్నాడు? పైగా ఒకదాని వెంట ఒకటిగా సినిమాల్లో నటించేస్తూ షాక్‌లిస్తున్నాడు. అసలింతకీ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీను స్ట్రాటజీ ఏంటి? .. అంటే ఇదిగో ఇదే సమాధానం.
అసలు కెరీర్ లో ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. తొలి చిత్రం `అల్లుడు శీను` (యావరేజ్) మినహా అన్నీ ఫ్లాపులే. అయినా బెల్లంకొండ శ్రీనుకి అవకాశాలు రావడానికి కారణం అతడు ఎంచుకుంటున్న యాక్షన్ స్క్రిప్టులేనన్న ముచ్చట సాగుతోంది. సినిమా సెట్స్ కెళ్లక ముందే యాక్షన్ మూవీ తీసి హిందీ రైట్స్.. డబ్బింగ్ రైట్స్.. శాటిలైట్ అంటూ రకరకాల కోణాల్లో బిజినెస్ ఎలా చేయాలి? అన్న మ్యాట్రిక్స్ లో ఆరితేరిపోయారు. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలతోనూ ముందే మంతనాలు సాగిస్తున్నారు. యాక్షన్ సినిమాలకు హిందీ డబ్బింగుల పరంగా గిరాకీ ఉండడంతో అది కాస్తా బెల్లంకొండకు కలిసొస్తోంది. ఇటీవల అతడి ఫెయిలైన సినిమాలకే 12 కోట్ల చొప్పున హిందీ డబ్బింగుల రూపంలో దక్కింది. 12 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేశారు.
ఈ శుక్రవారం (ఆగస్టు 2) రిలీజ్ కి రెడీ అవుతున్న `రాక్షసుడు` సినిమాకి హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 12.5 కోట్ల బిజినెస్ చేశారు. అలాగే జెమిని టీవీ 6కోట్లకు శాటిలైట్ రైట్స్ కట్టబెట్టారు. ఎలా చూసుకున్నా 18.50 కోట్ల మేర రెవెన్యూ ఇప్పటికే వెనక్కి వచ్చేసింది. ఇక థియేట్రికల్ రైట్స్ వగైరా అదనం. రాబడి ఎంత ఉంటుందో ముందే తెలుసు కాబట్టి అందుకు తగ్గట్టే బడ్జెట్ ని ప్లాన్ చేసి సినిమా తీస్తున్నారు. అలా ఈ యంగ్ హీరో పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతున్నాడట. అయితే ప్రతిసారీ ఫ్లాప్ ఇస్తే ఏ హీరోని అయినా భరించడం కష్టమే. ప్రతిదానికీ డెడ్ లైన్ ఉంటుంది. బెల్లంకొండకు `రాక్షసుడు` డెడ్ లైన్ లాంటిదేనని విశ్లేషిస్తున్నారు. మునుముందు పరిస్థితి అదుపు తప్పకుండా హిట్టు కొట్టి దారిలోకొస్తేనే. లేదంటే ట్రేడ్ ఇంకెంతో కాలం భరించదు! అన్న ముచ్చట కూడా సాగుతోంది. బెల్లంకొండ శ్రీను హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్- కోనేరు సత్యనారాయణ నిర్మించిన `రాక్షసుడు` (రచ్చాసన్ రీమేక్) ట్రైలర్ ఆకట్టుకుంది. ఆ క్రమంలోనే ఈసారైనా శ్రీనూ హిట్టు కొడతాడా? అంటూ ఆసక్తిగానే మాట్లాడుకుంటున్నారు.