శివోహం రీమేక్ కథేనా?

ఒక ఊరిలో మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన వ్యక్తి రమేష్ వర్మ. ఆ తరువాత నానితో రైడ్ సినిమాతో హిట్ కొట్టాడు. మూడో చిత్రం రవితేజతో వీర అనే సినిమా చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చారు. ఆ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని అబ్బాయితో అమ్మాయి అంటూ నాగ శౌర్యతో ఒక మూవీ చేశారు. ఇది కూడా ఫ్లాప్ కేటగిరిలోకి వెళ్ళిపోయింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన రాక్షసుడు కెరియర్ లో హిట్ ఇచ్చింది.

తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా చేసిన రాచ్చసన్ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. దీని తర్వాత మరల రవితేజతో ఖిలాడీ అనే సినిమా చేసి గత ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో రాక్షసుడు2 మూవీని లైన్ లో పెట్టారు. ఇప్పుడు ఊహించని విధంగా తమిళంలో బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయినా స్టూడియో గ్రీన్ లో మూవీ చేసే ఛాన్స్ అందుకున్నారు.

తెలుగు, తమిళ్ భాషలలో బైలింగ్వల్ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశారు. శివోహం టైటిల్ తో ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ట్రెజర్ హంట్ నేపథ్యంలో ఈ కథ ఉండబోతోందని పోస్టర్ బట్టి తెలుస్తోంది. దైవంతో ముడిపడిన స్టోరీ అని కూడా రివీల్ అవుతోంది. అయితే ఈ చిత్రంలో క్యాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం వారిని ఎంపిక చేసే పనిలో దర్శకుడు రమేష్ వర్మ ఉన్నారు.

అయితే ఈ మూవీ హిందీలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన బూల్ బులయ్యా 2కి రీమేక్ అనే ప్రచారం నడుస్తోంది. సినిమాలో కార్తిక్ ఆర్యన్, కియారా జోడీగా నటించారు. టబు ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేశారు. ఈ రెండు పాత్రలని ఆమె అద్భుతంగా తన అభినయంతో రక్తికట్టించారు. అయితే శివోహంలో కూడా ఆ పాత్ర కోసం టబుని సంప్రదించగా అనే తిరస్కరించారంట. దీంతో ప్రత్యామ్నాయంగా రమ్యకృష్ణని తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరో వైపు టబు పోషించిన పాత్రని కాస్తా మార్చి విజయ్ సేతుపతిని లీడ్ గా తీసుకోవాలని కూడా అనుకుంటున్నారంట. ఇక మెయిన్ లీడ్ కోసం వరుణ్ తేజ్ ని సంప్రదించారని, తను అంత ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఈ కారణంగా మూవీకి మెయిన్ హీరోని ఇంకా ఫైనల్ చేయలేదు. టాలీవుడ్ హీరోలు ఎవరూ దొరకకుంటే కోలీవుడ్ స్టార్స్ ని లైన్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారు.