ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఇవాళ బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 6.30గంటలకు కన్నుమూశారు. తన రచనలకు గానూ పద్మ శ్రీ, పద్మ భూషణ్, జ్ఞానపీఠ్ సహా ఎన్నో అవార్డులు దక్కించుకున్న గిరీష్ పలు తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించారు.

1938లో మహారాష్ట్రలోని మథేరన్‌లో జన్మించిన ఆయన కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. అలాగే రచయితగా మంచి పేరున్న ఆయన పలు పుస్తకాలను రచించడంతో పాటు.. కొన్నింటిని ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేశారు.

సినీ పరిశ్రమలో ఆయనకు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. రచయితగా ఙ్ఞాన్‌పీఠ్ అవార్డును గిరీష్ దక్కించుకున్నారు. అలాగే తెలుగులో ఆనందభైరవి, శంకర్ దాదా ఎంబిబిఎస్, ప్రేమికుడు, ధర్మచక్రం, రక్షకుడు వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు.

జీవితాంతం స్వేచ్ఛా హక్కుకు మద్దతు పలికిన గిరీష్.. మతాన్ని, హిందూత్వవాదాన్ని విమర్శించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మోదీని కూడా వ్యతిరేకించారు.