ఆన్లైన్లో టీ షర్ట్ ఆర్డర్ చేసి రూ. 10 లక్షలు పోగొట్టుకున్న యువతి..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఇలా టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి . అయితే ఇదే టెక్నాలజీని ఆసరాగా చేసుకొని కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ వాడుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తూ విచ్చలవిడిగా డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి రావడంతో ప్రజలు ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది సైబర్ నేరగాల వలలో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఆన్లైన్లో టీ షర్ట్ ఆర్డర్ చేసిన యువతిని లాటరీ పేరుతో మోసం చేసి ఏకంగా 10 లక్షలు కొట్టేసిన ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే.. బెంగళూరుకు చెందిన అరుణ అనే యువతి ఆన్లైన్లో టీషర్ట్ ఆర్డర్ పెట్టింది. ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్లు లాటరీలో మీకు కారు వచ్చిందని ఆమెకు ఒక లేఖ పంపారు. అంతే కాకుండా టీషర్ట్‌తో పాటు పోస్ట్ కార్డులు, స్క్రాచ్ కార్డ్‌లు, లేఖలు కూడా పంపారు. పోస్ట్ కార్డులు స్క్రాచ్ కార్డులు పంపడంతో ఆ మహిళ వీరిని గుడ్డిగా నమ్మింది. దీంతో లేఖలోని నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపింది. ఇక దీంతో సైబర్ నేరగాళ్లు అసలు కథ మొదలు పెట్టారు.

వాట్సాప్ మెసెంజర్ ద్వారా బాధిత మహిళ వారిని సంప్రదించగానే సైబర్ నేరగాళ్లు ఆమెతో కన్నడలో మాట్లాడి ఆమెకు తియ్యటి మాటలు చెప్పి కారు కావాలా, డబ్బులు కావాలా అని అడిగారు. ఆర్థిక సమస్యల కారణంగా కారు బదులు డబ్బులు ఇవ్వాలాలని అరుణ వారిని కోరింది.దీంతో ఆ డబ్బు ఇవ్వాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజుగా రూ.14, 800 పంపాలని అరుణకు చెప్పారు. ఆ తరువాత ఇతర ఫీజులు చెల్లించాలని చెప్పి రూ. 10 లక్షలు కాజేసారు. ఇలా ఏకంగా రూ. 10 లక్షలు డబ్బులు పోవడంతో తాను మోసపోయానని గుర్తించిన అరుణ బెంగళూరులోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం గాలిస్తున్నారు.