భన్సాలీ తర్వాత భట్స్ చోప్రాల్ని విచారిస్తారా?
ఇన్నాళ్లు ఆ నలుగురు అంటే టాలీవుడ్ వరకే పరిమితం అనుకున్నారు. కానీ ఇటీవల సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ లో ఆ నలుగురి లోగుట్టు బయటపడుతోంది. నెప్టోయిజం గురించి.. బాలీవుడ్ మాఫియా గురించి బయటి ప్రపంచానికి విస్త్రతంగా తెలుస్తోంది. ఇక ఈ మాఫియాలో కపూర్స్.. ఖాన్స్.. భట్స్ .. భన్సాలీలు అంటూ సుశాంత్ సింగ్ అభిమానులు సీరియస్ గా సీబీఐ విచారణను కోరారు. అలాగే పలువురు జర్నలిస్టులు ఆయా కుటుంబాల అరాచకాల్ని తూర్పారబడుతూ పలు ఆర్టికల్స్ రాయడం సంచలనమైంది.
తాజాగా ముంబై బాంద్రా పోలీసులు ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీని విచారించారు. భన్సాలీ ఎందుకని సుశాంత్ సింగ్ కి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తొలగించారు. తనని ఎవరు ప్రేరేపించారు? అన్న కోణంలో పోలీసుల విచారణ సాగింది. దాదాపు మూడు గంటల పాటు కేవలం భన్సాలీని విచారించారంటే ఈ కేసులో లోతైన విషయాలెన్నో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సుశాత్ సింగ్ కి తాను ఆఫర్ ఇచ్చిన సమయంలో వేరొక అవకాశం రావడంతో కలిసి పని చేయడం కుదరలేదని భన్సాలీ పోలీసులకు వెల్లడించారు. అయితే అది నిజమా? లేక చోప్రాలు.. భట్స్ వంటి వారి ప్రమేయం ఏదైనా ఉందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇక ఇప్పటికే భన్సాలీ సహా ఇతర టాప్ ప్రొడ్యూసర్స్ కి పోలీసులు నోటీసులు పంపి విచారించే పనిలో పడ్డారట.
నిజానికి యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో సుశాంత్ సింగ్ పై కుట్ర జరిగిందని ఆ తర్వాత భన్సాలీతో కలిసి చోప్రాలు భట్స్ సుశాంత్ ని బ్యాన్ చేశారని రకరకాలుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నిటి కోణంలో ఆర్టికల్స్ రాసిన జర్నలిస్టుని కూడా పోలీసులు విచారణకు పిలిచారని తెలిసింది. ఇక తీగ కదిలితే డొంకంతా కదిలినట్టు బాలీవుడ్ ఇన్ సైడ్ ఏం జరుగుతోందో పోలీసులు బయటపెట్టనున్నారన్నమాట.