ఎక్కడో చోట చిచ్చు పెట్టి , ఆ వెలుగులో తన పబ్బం గడుపుకోవటం వర్మకు అలవాటు. మొన్నటిదాకా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెలుగుదేశంకు నిద్రలేకుండా చేసిన ఈయన ఇప్పుడు కమ్మ, రెడ్లు అంటూ మరోసారి చిచ్చు రగల్చే ప్రయత్నం చేస్తున్నారు. కులాలతో ఆయన మళ్లీ ఆట మొదలెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విజయవాడ, అమరావతి కేంద్రంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే పేరుతో కొత్త చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నట్టు వెల్లడించారు. ఆయన రూపొందించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయవాడలోని ఫిలిం చాంబర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జీవీ తన తదుపరి సినిమా టైటిల్‌ను ప్రకటించారు.
ఇందులో నటీనటులను త్వరలోనే ఎంపిక చేస్తామని చెప్పారు. తొలుత ‘కమ్మ రాజ్యంలో కడప రౌడీలు’ అని ప్రకటించారు. పక్కనే ఉన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి చేతులెత్తి దండం పెట్టిన తర్వాత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరు వెల్లడించారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి మాట్లాడుతూ..నందమూరి తారక రామారావు నిజ జీవితంలో చివరి రోజుల్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించామన్నారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇప్పుడాయన చిత్రపటాన్ని పెట్టుకుని రాజకీయాలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.
వెన్నుపోట్లు, ఇచ్చిన మాటలపై నిలబడ లేకపోవడం వల్లే చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ఆర్జీవీ విశ్లేషించారు. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనసేనకు 1 సీటు వస్తే.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయని, కాబట్టి జనసేన కంటే ప్రజారాజ్యం 18 రెట్ల బాహుబలి అని అభివర్ణించారు.