ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఏం చేసినా అందులో కొత్తదనం కనిపిస్తుంది. అంతకుమించి క్రియేటివిటీని ఎలివేట్ చేయడం అతడి ప్రత్యేకత. గుంపులో వెళ్లే గొర్రెను కాను గుంపును నడిపించే గొర్రెను అన్నట్టుగానే ఉంటుంది ఆయన వ్యవహార శైలి. రొటీన్ కి భిన్నంగా ఆలోచించడం తనకు మాత్రమే చెల్లిందని ఆయన ఎన్నోసార్లు నిరూపించారు. ఒక సమస్య వస్తే దానిని ఎదుర్కొనేందుకు అందరిలా ఒకే మూస దారిలో వెళ్లడం ఆయనకు అస్సలు తెలీదు. అందుకే ఎప్పటికీ ఫ్లాపులు తీసినా ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు.
అయినా ఈ పనికిమాలిన సిస్టమ్ కి తలొంచి బతకడం అంటే ఆయనకు మహా చిరాకు. అందుకే నా ఇష్టం నేనింతే అన్న తీరుగా ఈ బతుకుబండిని లాగించేస్తున్నాడు. ఈసురోమని లాక్ డౌన్ పేరు చెప్పి ఏడ్చిన దర్శకులను.. నిర్మాతలనే చూశాం. కానీ లాక్ డౌన్ నిబంధనల్ని అతిక్రమించకుండా ఈ లాక్ డౌన్ సమయంలో కూడా `కరోనా వైరస్` పైనే సినిమా తీసిన ఘనాపాటి. త్వరలోనే ఈ సినిమాని వెబ్ సిరీస్ ఫార్మాట్ లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తాను తీసింది యూట్యూబ్ సినిమా కాదు.. వెబ్ సిరీస్ మాత్రమే. ఇకపైనా వెబ్ సిరీస్ లు తీసేందుకు సొంతంగా తనకంటూ ఓ వేదికను సిద్ధం చేసుకుంటున్నానని అందుకు సంబంధించిన యాప్ ని లాంచ్ చేస్తానని ప్రకటించి తనదైన శైలిని చెప్పకనే చెప్పాడు.
కొవిడ్ 19 విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ సైలెంట్ గా సినిమా తీసేశాడు. అది కూడా లాక్ డౌన్ మొదలైన పది రోజులకే సినిమా మొదలు పెట్టి అది ఎత్తేయక ముందే పూర్తి చేసేశాడు ఆర్జీవీ. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల రూల్స్ పాటించి `కరోనా వైరస్` సినిమా తీశాను. నేను ఎవరికీ తల వొంచాల్సిన పనే లేదు! అంటూ తనదైన శైలిలో చెప్పారు ఆర్జీవీ. ఇక ఇందుకోసం అతడు ఇండస్ట్రీ కార్మికుల్ని ఎవరినీ పనిలో పెట్టుకోలేదు. తనవద్ద ఉన్న పరిమిత సిబ్బంధితోనే సినిమా తీసేశాడు. క్లైమాక్స్ అనే చిత్రాన్ని ఓటీటీ కోసమే తీశామని తెలిపారు. సాధ్యమైనంత తొందర్లోనే `ఆర్జీవీ వరల్డ్` అనే సొంత ఓటీటీ వేదికను తెస్తానని తెలిపారు.
అయితే ఆర్జీవీ ఆచరణీయమైన ఆలోచన ఇతర దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ ఎందుకు రాలేదు? అసలు కేవలం 10 మంది సిబ్బందితో సినిమాలు తీసిన ఘనాపాటీలు చాలా మంది సినిమా హిస్టరీలో ఉన్నారు. కానీ ఈ లాక్ డౌన్ వేళ అలాంటి పని ఎవరూ ఎందుకు చేయలేకపోయారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చాయి ఇప్పుడు. వీటికి సమాధానం కనీసం చిన్న నిర్మాతలు అయినా చెబుతారేమో చూడాలి. అయితే ఆర్జీవీ పరిమిత సిబ్బంధితో ఎలాంటి సినిమా తీశాడు.. దాని సక్సెస్ రేంజ్ ఎలా ఉండనుంది? అన్నది కూడా డిసైడ్ చేస్తుంది. ఓటీటీ సినిమా అంటే.. అది కచ్ఛితంగా పెద్ద తెరకు ధీటైన విందును ఇచ్చేదేనని నమ్ముతారు. మరి ఆ నమ్మకాన్ని ఆర్జీవీ నిలబెడతాడా? అన్నది చూడాలి.
కంటెంట్ బావుంటే ఆదరించేందుకు ఓటీటీ అయితే ఏంటి? థియేట్రికల్ రిలీజ్ అయితే ఏంటి? అన్న పరిస్థితి మున్నుందు రానుంది. మహమ్మారీ దెబ్బకు జనం ఆలోచన మారింది. ముఖ్యంగా యూత్ కి ఓటీటీ బాగా చేరువైపోయింది. ఈ పర్యవసానం సరికొత్త ఆవిష్కరణలకు దారి తీస్తే మంచిదేగా. అన్నట్టు ఆర్జీవీ ఇప్పుడు మిడుతల దండుపైనే పడేట్టున్నాడు. ఆరుగాలం రైతు పండించిన ఎకరాల పంటను క్షణ కాలంలో పీల్చి పిప్పి చేసే మాయదారి మిడుతల దండు తెలుగు రాష్ట్రాలపై పడబోతోందన్నది ప్రస్తుత సెన్సేషన్. మరి దీనిపై ఆర్జీవీ ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడో ఏమిటో!