యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు తెరవెనక కారణాలు వేరే ఉన్నాయని పలువురు బాలీవుడ్ ప్రముఖులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిచోర్ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత కేవలం ఆరు నెలల వ్యవథిలో ఆరేడు అవకాశాల్ని సుశాంత్ కోల్పోయాడు. ఆ క్రమంలోనే అతడు తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై కంగన సహా పలువురు ప్రముఖులు తీవ్ర వ్యాఖ్యల్ని చేశారు. బాలీవుడ్ మాఫియా.. నెప్టోయిజం.. ఇన్ సైడర్స్.. బిజినెస్ అంటూ రకరకాల అంశాల్ని ప్రస్థావించారు. ప్రతిభావంతులైన బయటి వారిని ఇక్కడ ఇన్ సైడర్స్ లోనికి రానివ్వరని రకరకాల రాజకీయాలు చేసి కుట్రలు పన్ని దూరం పెట్టేస్తారని పలువురు సినీప్రముఖులు వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇక కరణ్ జోహార్ సహా కపూర్ కుటుంబాల్ని.. ఖాన్ లను.. తీవ్రంగా తప్పు పడుతున్నారు.
అయితే వీళ్లంతా నేరస్తులా? అని ప్రశ్నిస్తే ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ స్పందన మాత్రం పూర్తి ఆపోజిట్ గా ఉంది. ముఖ్యంగా ఆయన దర్శకనిర్మాత కరణ్ జోహార్ ని వెనకేసుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి కరణ్ అంటే విరుచుకుపడే వర్మేనా ఇలా మాట్లాడింది? అన్న సందేహం కలగక మానదు. ఇంతకీ ఆర్జీవీ కరణ్ ని ఎలా వెనకేసుకొచ్చాడు? అంటే.. ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ నిర్ణయించరని.. ప్రేక్షకులు మాత్రమే నిర్ణయిస్తారని ఆర్జీవీ ఓ ట్వీట్లో వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీ లో ఇన్ సైడర్స్ గా ఎవరు ఉండాలో ప్రేక్షకులే నిర్ణయిస్తారని అన్నారు.
కరణ్ జోహార్ .. అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు ఇండస్ట్రీ బయటి వారేనని అయితే ఇక్కడ స్థిరపడ్డారని దానికి కారణం ప్రేక్షకులేననే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ సుశాంత్ సింగ్ మరో పది పదేహేనేళ్లు ఇక్కడే ఉండి ఆ తర్వాత తన వారసుడిని పరిచయం చేస్తే అప్పుడు కూడా ఆయనను ఇలానే అనేవారా? అని నిలదీశారు. సుశాంత్ ఇప్పటికే పెద్ద స్టార్ గా నిరూపించుకున్నారు. కానీ ఇంకా ఎన్నో వ్యక్తిగత కారణాలు ఉండి ఉండొచ్చని అన్నారు.
రాజకీయ నాయకులు ములాయాం.. ఉద్ధవ్ ఠాక్రే సహా బిజినెస్ మన్లు ధీరూభాయ్ అంబానీ.. ముఖేష్ అంబానీలను వారసుల్ని చేసి ఏల్తున్నారు. అలానే బాలీవుడ్ లోనూ ప్రముఖులు నటవారసుల్ని పరిచయం చేస్తున్నారని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. అయితే ఆర్జీవీ ఇలా వ్యాఖ్యానించడానికి కారణం తెరవెనక ఇంకేదైనా ఉందా? అమితాబ్ .. అనీల్ కపూర్ వంటి ఇండస్ట్రీ సన్నిహిత స్టార్లు ఆయనను ప్రభావితం చేశారా? అన్నది తేలాల్సి ఉంది.