నిత్యం ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాంగోపాల్ వర్మ తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్‌టీఆర్ చిత్రానికి సంబంధించి వెన్నుపోటు పేరుతో ఓ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటపై ఎస్వీ మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పాట తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అవమానించేవిధంగా ఉందని, ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా పాటను రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో.. వివాదాన్ని మరింత పెంచటమే లక్ష్యంగా వర్మ… కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్ రెడ్డికి ఆయన లీగల్ నోటీసులు పంపారు. తనపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేకు ఎస్.ప్రభాకర్ అనే అడ్వొకేట్ ద్వారా వర్మ లీగల్ నోటీసులు పంపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్‌లో ఎవరినీ కించపరచలేదని చెప్పిన ఆర్జీవీ.. చంద్రబాబు పరువుకు నష్టం వాటిల్లితే.. కేసు పెట్టాల్సింది ఆయనేనని, ఎమ్మెల్యే కాదని ఆ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
తనపై పెట్టిన తప్పుడు కేసును 48 గంటల్లోగా ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వర్మ డిమాండ్‌కు అనుగుణంగా ఎమ్మెల్యే క్షమాపణలు చెప్తారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.