వాదాలు, వివాదాలు మధ్య టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్లు కొత్త యాజమాన్యం అఫీషియల్ గా ప్రకటించింది. అలాదే అదే సమయంలో సీఎఫ్‌వోగా ఉన్న కేవీఎన్ మూర్తిని కూడా బాధ్యతల నుంచి తప్పించినట్లు వెల్లడించింది. ఈ నెల 8న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా శుక్రవారం జరిగిన సంస్థ వాటాదార్ల సమావేశంలో ఆమోదముద్ర లభించినట్లు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) కొత్త డైరెక్టర్లు కౌశిక్‌రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్‌లు ప్రకటించారు.
ఈ సందర్బంగా తమ సంస్థకు మధ్యంతర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా మహేంద్ర మిశ్రాను, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా జి.సింగారావును నియమించినట్లు తెలిపారు. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఛానల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సింగారావు ప్రస్తుతం 10టీవీ సీఈవోగా ఉన్నారు. టీవీ9 ను నిర్వహిస్తున్న సంస్థ అయిన ఏబీసీపీఎల్‌లో 90.54 శాతం వాటాను గత ఏడాది ఆగస్టులో అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.
ఆ తర్వాత తమ తరఫున కౌశిక్‌రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్‌లను ఏబీసీపీఎల్‌లో డైరెక్టర్లుగా నియమించింది. కానీ ఈ నియామకానికి రవిప్రకాశ్, మూర్తి అడుగడుగునా అడ్డుతగిలినట్లు, కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించి కంపెనీల రిజిస్ట్రార్ వద్ద డీఐఆర్-12 దాఖలు చేయకుండా విపరీతమైన జాప్యం చేసినట్లు ఈ సందర్భంగా సాంబశివరావు వివరించారు.
అంతేగాక అప్పటివరకూ ఉన్న కంపెనీ సెక్రెటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయనను తొలగించారని తెలిపారు. కొత్త డైరెక్టర్ల నియామకానికి ఈ ఏడాది మార్చి 29న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, ఆ తర్వాత బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా రవిప్రకాశ్ నిరాకరిస్తూ వచ్చారని పేర్కొన్నారు.
అలాగే సంస్థలో 90 శాతం వాటా ఉన్న ‘అలంద’ ప్రతినిధులను యాజమాన్య స్థానాల్లోకి రాకుండా కావాలనే నిరోధించారని అన్నారు. సంస్థలో డైరెక్టర్ల పదవుల నుంచి కూడా వారిద్దరినీ తొలగించినట్లు స్పష్టం చేశారు. రవిప్రకాశ్ ఇక ఎంతమాత్రం తమ సంస్థ ప్రతినిధి కారని, బ్యాంకులు, ఇతర సంస్థలు, సాధారణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. సంస్థలో ఆయనకు 8 శాతం వాటా ఉందని, ఆయన సాధారణ వాటాదారుడిగా కొనసాగుతారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.