బిగ్ బాస్-3 హోస్టింగ్.. కింగ్ స్థానంలో క్వీన్ శివ‌గామి

తెలుగు లోగిళ్ల‌లో బిగ్ బాస్ ఎంత‌గా పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. ఎన్టీఆర్, నాని త‌ర్వాత మూడో సీజ‌న్ ని గ్రాండ్ స‌క్సెస్ చేయ‌డంలో కింగ్ నాగార్జున హోస్టింగ్ కి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇప్ప‌టికే బుల్లితెర‌పై టాప్ టీఆర్పీతో దూసుకెళుతోంది తాజా సీజ‌న్. అయితే ఈ షో ఇప్ప‌టికే ఏడు వారాలు పూర్త‌యింది. ఈ శ‌ని, ఆదివారాల్లో హౌస్ నుంచి మ‌రో స‌భ్యుడిని పంపించాల్సి ఉంటుంది.

ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్ట్ ఒక‌టి రివీల్ చేసింది స్టార్ మా. ఈ రెండ్రోజుల హోస్టింగ్ కి కింగ్ నాగార్జున అందుబాటులో లేర‌ని దీంతో క్వీన్ శివ‌గామి ఎంట్రీ ఇస్తోంది అంటూ ప్ర‌క‌టించింది. అందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయ‌డంతో స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ రెండ్రోజుల ఎపిసోడ్స్ ని ర‌మ్య‌కృష్ణ ఎలా ర‌క్తి క‌ట్టించ‌నున్నారో అన్న ఆస‌క్తి అభిమానుల్లో పెరిగింది. పెద్ద తెర‌పైనే కాదు.. బుల్లితెర‌పైనా ర‌మ్య‌కృష్ణ చాలా సీనియ‌ర్. అందువ‌ల్ల త‌న‌పై ఫ్యాన్స్ లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. కింగ్ ని మించి క్వీన్ ర‌క్తి క‌ట్టిస్తారా లేదా? అన్న‌ది వేచి చూడాల్సిందే. అయితే ఈ వారం నాగార్జున అందుబాటులో లేక‌పోవ‌డానికి కార‌ణం ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌లు స్పెయిన్ ఇబిజ‌లో జ‌ర‌గ‌డ‌మేన‌ని తెలుస్తోంది.

బిగ్ బాస్ స‌న్నివేశం ప‌రిశీలిస్తే.. ఈ వారం ఎలిమినేష‌న్ ఉంటుందా అన్న‌ది స‌స్పెన్స్. మ‌హేష్‌, హిమ‌జ‌, పున‌ర్న‌వి ల‌లో ఎవ‌రో ఒక‌రిని ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ చేయాల్సి ఉండ‌గా ప్ర‌స్తుతానికి గండం త‌ప్పిన‌ట్టే. బిగ్ బాస్ షోలో వినోదం ప‌రంగా సీన్ ఎలా ఉంది? అంటే వారం వారం టాస్క్ లు ర‌క్తి క‌ట్టిస్తున్నా గ‌త వారం చ‌ప్ప‌గా సాగింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ఛలో ఇండియా టాస్క్‌ స‌ర‌దా సరదాగా సాగిపోయింది. అలాగే ఉక్కుమ‌నిషి టాస్క్ నెగ్గిన హీరో వ‌రుణ్ సందేశ్ కెప్టెన్సీ గోల్ నెర‌వేరింది.