బాలీవుడ్‌కి వెళ‌తానంటున్న‌ ర‌మ్య‌కృష్ణ‌

ఖల్ నాయక్, క్రిమినల్, షాపాత్, బడే మియాన్ చోటే మియాన్ వంటి హిందీ చిత్రాలలో బాలీవుడ్ లో పాపుల‌రైన ర‌మ్య‌కృష్ణ అనంత‌ర కాలంలో అక్క‌డ న‌టించ‌లేదు. బాహుబ‌లి ఫ్రాంఛైజీలో శివ‌గామి పాత్ర‌తో మ‌రోసారి అక్క‌డ హాట్ టాపిక్ అయ్యారు. కానీ తిరిగి హిందీ చిత్ర‌సీమ‌కు వెళ్లే ఆలోచ‌న లేదా? అంటే ఎందుకు లేదు అని అనేస్తున్నారు సీనియ‌ర్ న‌టి.

నేను విరామం తీసుకోలేదు. సాధారణంగా, నా సినిమాలు బాగా ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే బాలీవుడ్ లో న‌టించ‌లేద‌ని తెలిపిన ర‌మ్య‌కృష్ణ అక్క‌డ కొన్ని ఆఫర్లపై ఆసక్తి చూపలేదట‌. తాను సౌత్ లో బిజీ అయిపోవ‌డం వ‌ల్ల‌నే హిందీలో న‌టించ‌లేద‌ని వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ-తమిళ చిత్రంలో తాను న‌టించాల్సి ఉండ‌గా లాక్ డౌన్ వ‌ల్ల టేకాఫ్ కాలేదు. కొన్ని ప్రాబ్లెమ్స్ ని ప‌రిష్క‌రించుకుని సెట్స్ కెళ్లే వీలుంద‌ని తెలిపారు. త‌దుప‌రి విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంట‌గా న‌టిస్తున్న ఫైట‌ర్ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని తెలిపారు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ సహ-నిర్మాత. పూరి జగన్నాధ్ దర్శకుడు. బాహుబ‌లి రేంజులో పాన్ ఇండియా చిత్రం కానుంద‌ని వెల్ల‌డించారు. దాదాపు 50 శాతం షూట్ పూర్తయింది. త‌దుప‌రి విరామం త‌ర్వాత సినిమా మొద‌ల‌వుతుంద‌ని తెలిపారు. అలాగే క్వీన్ వెబ్ సిరీస్ లో న‌టిస్తున్న సంగ‌తిని ప్ర‌స్థావించారు. చెన్న‌య్ నిర్భంద‌నం వ‌ల్ల ఇది షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ట‌.

లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఎలా స‌ద్వినియోగం చేశారు? అని ప్ర‌శ్నిస్తే.. “నేనే ఇంట్లో వంటకాలను ప్లాన్ చేస్తున్నాను. వ్యాయామం చేస్తున్నా. కుటుంబంతో గడుపుతున్నా. ప్ర‌స్తుతం తక్కువ కాలుష్యం తక్కువ ట్రాఫిక్ ఉంది. ప‌రిస్థితి మెరుగైతే త‌దుప‌రి షూటింగుల్లో పాల్గొనాల్సి ఉంది“ అని ర‌మ్య తెలిపారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో వందలాది చిత్రాలలో నటించిన ర‌మ్య‌కృష్ణ‌… తన కెరీర్ హైలైట్ గురించి చెబుతూ.. బాహుబలి సిరీస్ (2015- 2017) ది బెస్ట్ అని తెలిపారు. ఇది అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటి అని ఆమె అన్నారు. ఇందులో శివగామి దేవి బాగా ప్రాచుర్యం పొందింది. దీనిపై `ది రైజ్ ఆఫ్ శివగామి` అనే పుస్తకం ప్రచురిత‌మైంద‌ని తెలిపారు. శివ‌గామి త‌ర‌హాలోనే ఏదైనా ఆస‌క్తి పెంచే పాత్ర‌ను ఆఫ‌ర్ చేస్తే న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని వెల్ల‌డించారు.