టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌లో మాత్రమే కాదు, యాడ్ ప్రపంచంలోనూ తన ప్రత్యేకమైన ముద్ర వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్లకు ఆయన ప్రచారం చేస్తుండటం విశేషం. టామ్ మీడియా రీసెర్చ్ ప్రకారం, 42 బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్‌లో ధోనీ కనిపిస్తూ బాలీవుడ్ సూపర్‌స్టార్లను సైతం అధిగమించారు. అమితాబ్ బచ్చన్ 41 బ్రాండ్లకు, షారుఖ్ ఖాన్ 34, అక్షయ్ కుమార్ 28 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నప్పటికీ, ధోనీ ప్రభావం వాటి కంటే ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
2024 మొదటి అర్థభాగంలోనే ధోనీ భారీ సంఖ్యలో యాడ్స్‌లో కనిపించారు. సిట్రాన్, గరుడ ఎయిరోస్పేస్, క్లియర్ ట్రిప్, పెప్సీ కో, మాస్టర్ కార్డ్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు, ఓటు హక్కు అవగాహన కోసం జార్ఖండ్ ఎన్నికల కమిషన్ రూపొందించిన యాడ్‌లోనూ ఆయన కనిపించడం ప్రత్యేకత. ఐపీఎల్ సీజన్‌తో పాటు, ఈ బ్రాండ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, అతని ఫాలోయింగ్ తగ్గకపోవడం, ప్రజలపై ఆయన కలిగించే ప్రభావం బ్రాండ్లకు బలమైన ప్రోత్సాహంగా మారింది.
ప్రత్యేకించి, ఐపీఎల్ సీజన్‌లో అతని క్రేజ్ మరింతగా పెరుగుతుండటంతో, యాడ్ వరల్డ్‌లో ధోనీకున్న డిమాండ్ మరింతగా కనిపిస్తోంది. విరామం లేకుండా ప్రజల హృదయాల్లో చోటు సంపాదిస్తున్న ధోనీ, యాడ్ ఇండస్ట్రీలో కూడా మిస్టర్ కూల్‌గా తన స్థానాన్ని మరింత బలపరుస్తున్నారు. తన నిరాడంబరత, అందరితో కలిసిపోవడం, విశ్వసనీయత ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఈ క్రేజ్‌ను ధారాళంగా ఉపయోగించుకుంటున్న బ్రాండ్లు, ధోనీతో తమ మార్కెట్ వ్యూహాలను ముందుకు తీసుకెళ్తున్నాయి.