ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత రెండు రోజులుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించి ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన కేసీఆర్ ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు.
వర్మ మాట్లాడుతూ..‘నిజం చెప్పాలంటే కేసీఆర్.. ఇలియానా కంటే అందంగా ఉంటారు. అందం అంటే లుక్స్‌కి సంబంధించింది కాదు. ఆకర్షించే గుణం గురించి నేను మాట్లాడుతున్నది. ఇలియానా డాన్స్ మూడు నిమిషాల కంటే ఎక్కువ చూడలేను. అదే కేసీఆర్ మాట్లాడితే మూడు గంటలపాటైనా వింటాను. ఎందుకంటే అన్నీ పంచ్ డైలాగ్‌లు పేలుస్తారు. హీరోల కంటే కూడా ఆయన చరిష్మా గొప్పది. కుదిరితే ఆయన బయోపిక్ కచ్చితంగా తెరకెక్కిస్తాను’ అన్నారు.
అలాగే.. ‘కేసీఆర్ మిషన్ గన్ తీసుకుని ప్రతిపక్షాన్ని నామరూపాల్లేకుండా కాల్చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న విశ్వాసమే ఆయన్ను గెలిపించిందనేది నా భావన. అందరూ హంగ్ వస్తుంది లేదా ఇంకా ఏదో జరుగుతుందని చెప్పారు. కానీ ఎవరూ కూడా ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు. నేను కూడా అస్సలు ఊహించలేదు’ అన్నారు.
ఇక ఓ ముఖ్యమంత్రి అదీ రెండోసారి.. మొదటి దఫా కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం నిజంగా అరుదైన విషయం. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ఆయన్ను 2.0 అన్నాను అని చెప్పుకొచ్చారు.
రామ్ గోపాల్ వర్మ సమర్పణలో ధనుంజయ్, ఐరా మోర్‌లు జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భైరవ గీత. వర్మశిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వంలో… తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడనాట విడుదల కాగా.. డిసెంబరు 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.