“వరుణ్ ఎప్పుడూ మమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తూనే వచ్చాడు. తన ఓ సినిమా చూసి ఆనందపడ్డా.. మరికొన్ని చూసి అసూయపడ్డా.. ‘అంతరిక్షం’ ట్రైలర్ చూసి జెలసీ ఫీలయ్యా. చాలా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు మన వద్దకు రావు. మన డెడికేషన్, ఆలోచన తీరే మనకిష్టమైన పది సినిమాలని కానీ, పది మంది వ్యక్తులను కానీ దగ్గరకి చేరుస్తుంది. పాజిటివ్ ఆటిట్యూడ్, ఆలోచన ఉన్న వ్యక్తికి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడని నేను నమ్ముతున్నా. వరుణ్ ఇకపైనా మంచి సినిమాలు చేస్తాడనే నమ్మకం ఉంది’’ అన్నారు రామ్ చరణ్.
వరుణ్ తేజ్ హీరోగా, లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ముఖ్య అతిథి రామ్‌చరణ్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే చరణ్ కంటిన్యూ చేస్తూ…‘‘ఏడాదికి ఓ సినిమా చేస్తే చాలా గొప్ప. రెండు చేస్తే అది ఓ అదృష్టం. ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే కోరిక మా అందరికీ ఉంటుంది. రెండుసార్లు మీ ముందుకు (ఫ్యాన్స్) రావాలనే ఆనందం సినిమా కన్నా ఎక్కువ సంతోషం ఇస్తుంది. ‘అంతరిక్షం’ లాంటి మంచి సినిమాతో వరుణ్ మీ ముందుకు వస్తున్నాడు’’ అని అన్నారు చరణ్.
జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.