ఫ్యాన్స్ కు రజనీ సీరియస్ వార్నింగ్, పట్టించుకోకపోతే చర్యలు

తమళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు వార్తల్లోకి వచ్చారు. ఆయన తన అభిమానులకు, ప్రజాసంఘ కార్యకర్తలకు, థియేటర్ల మాజమాన్యానికి ఒక హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక తన తాజా చిత్రం టిక్కెట్ల గురించి కావటం విశేషం. ఈ హెచ్చరికకు మీడియా మంచి పబ్లిసిటీ ఇస్తోంది.

వివరాల్లోకి వెళితే… రజనీకాంత్‌ తాజా చిత్రం 2.o.ఈ చిత్రాన్ని శంకర్‌ దర్శకత్వంలో లైకా సంస్థ సుమారు రూ.550 కోట్లతో రూపొందించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య ఈ నెల 29న విడుదల అవుతోంది. అయితే సాధారణంగా ఇలా స్టార్స్‌ చిత్రాలు రిలీజ్ అయ్యినప్పుడు థియేటర్లలో నిర్ణయించిన ధరకంటే అధికంగా టిక్కెట్లు అమ్ముతూంటారు. ఫ్యాన్స్ కూడా అదే ఊపులో రూ. 200 టికెట్‌ను రూ. 2వేలు, 3వేలకు బ్లాక్‌లో కొనుక్కుంటున్నారు.

ఇది ఎప్పటినుంచో జరుగుతున్నదే. రీసెంట్ గా విజయ్‌ నటించిన సర్కార్‌ చిత్రానికి ఇలానే జరిగింది. దీంతో రజనీకాంత్‌ తన ప్రజా సంఘం కార్యకర్తలకు, థియేటర్ల యాజమాన్యానికి ఒక హెచ్చరిక చేశారు. త్వరలో విడుదల కానున్న 2.o చిత్రానికిగానూ థియేటర్లలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు అని చెప్పి పొందిన టికెట్లను బయట వారికి విక్రయించరాదు.

అదే విధంగా అభిమానుల నుంచి థియేటర్ల మాజమాన్యం నిర్ణయించిన టికెట్‌ కంటే అధికంగా వసూలు చేయరాదు. దీన్ని అతిక్రమించి నిర్వాహకులు, కార్యకర్తలు ప్రవర్తిస్తే తగిన చర్యలు తీసుకుంటామని రజనీకాంత్‌ తన ట్విట్టర్‌ ద్వారా హెచ్చరించారు. అయితే దీన్ని ఎంతవరకూ అభిమానులు సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.