రాజశేఖర్ హీరోగా రిటైర్మెంట్ ప్రకటించి ఇక విలన్ గా బిజీ అవుతారు. జగపతిబాబులా స్క్రీన్ పై అదరకొడతారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ సినిమాలో విలన్ గా అడుగుతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఆ విషయమై ఏమీ స్పందించలేదు. విలన్ గానూ చెయ్యలేదు. గరుడవేగ సినిమా తర్వాత మళ్లీ కల్కి అంటే మళ్లీ హీరోగా చేసారు. అయితే విలన్ గా చేయటం నిజంగా రాజశేఖర్ ఇష్టం లేదా అంటే ఆయన అందుకు కొన్ని కండీషన్స్ ఉన్నాయంటున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం.
రాజశేఖర్ మాట్లాడుతూ..విలన్‌గా చేయడానికి నేను రెడీ. నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకని, భయపడుతున్నారేమో. ఉదాహరణకు… ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ అయితే చేస్తా. రెగ్యులర్ విలన్ రోల్స్ చేయను. అరవింద సమేత వీరరాఘవ, శ్రీమంతుడు చిత్రాల్లో జగపతిబాబు చేసిన పాత్రలు కూడా నచ్చాయి. అటువంటివి వచ్చినా చేస్తా అన్నారు.
రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంకు డివైడ్ టాక్ ఉన్నా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.