రజనీ ‘పేట’తెలుగు ట్రైలర్..ఎలా ఉందంటే

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘పేట’ తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. రీసెంట్ గా విడుదలైన తమిళ ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇందులో సిమ్రన్‌, త్రిష హీరోయిన్స్ గా నటించారు. విజయ్‌ సేతుపతి విలన్ పాత్ర పోషించారు. నవాజుద్దిన్‌ సిద్ధిఖి, బాబీ సింహా, శశికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Petta - Official Trailer [Telugu] | Superstar Rajinikanth | Sun Pictures | Karthik Subbaraj |Anirudh

‘ఇరవై మందిని పంపించాను. అందర్నీ చితక్కొట్టి తరిమేశాడు’ అని ఓ వ్యక్తి చెబుతున్నప్పుడు రజనీని వెనక నుంచి చూపించిన సన్నివేశంతో ట్రైలర్‌ మొదలైంది. ‘చూస్తావ్‌గా.. ఈ కాళీ ఆడించే ఆట’ అని రజనీ డైలాగ్‌ చెప్పే విధానం ఆకట్టుకుంటోంది. ‘చూడ్డానికి చిన్నపిల్లాడిలా చాలా స్టైల్‌గా ఉన్నారు’ అని మేఘా ఆకాశ్‌..రజనీని చూసి చెబుతున్న డైలాగ్‌ బాగుంది. కొందరు రౌడీలు తలైవాను కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన బల్లపై ఎక్కి స్టైల్‌గా కూర్చుని నవ్వుతూ..‘నిజం చెబుతున్నాను.. కొట్టి అండర్‌వేర్‌తో పరిగెత్తిస్తాను..పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో..’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

ట్రైలర్‌లో రజనీ స్టైల్‌, లుక్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ఇందులో విజయ్‌ సేతుపతి విలన్ పాత్రలో కన్పించనున్నారు. ఫైట్ సీన్స్ లో రజనీ స్టైల్‌ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖి కీలక పాత్రలో నటించారు. ట్రైలర్‌ చివర్లో రజనీ స్టెప్పులేసుకుంటూ రావడం దుమ్ము రేపుతోంది. ఇక ఈ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ‘పేట ట్రైలర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇండియా‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉంది.

‘పేట’ సినిమాకు కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తోంది. త్రిష, సిమ్రన్‌ ఇందులో కథానాయికల పాత్రలు పోషించారు. విజయ్ ‌సేతుపతి, మేఘా ఆకాశ్‌, బాబి సింహా, శశికుమార్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. సెన్సార్‌ బోర్డు ‘యూ/ఏ’ ధ్రువపత్రం ఇచ్చింది. జనవరి 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘పేట’ను వివిధ భాషల్లోనూ విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట.