దేశంలో కరోనా ఉగ్ర రూపం చూపిస్తోంది. మహరాష్ర్ట, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ రాష్ర్టాలు పాజిటివ్ కేసులు నమోదవడంలో జోరుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. ఊహించని విధంగా ఆ రాష్ర్టంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ హీరోలు బెంబేలెత్తిపోతున్నారు. ఇల్లు కదలాలంటే భయపడిపోతున్నారు. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఏడాది పాటు ఇంట్లోంచి బయటకు రాకూడదని నిర్ణయించుకు న్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్ల్లు వెల్లడించారు.
రజనీ వయసు రీత్యా వైరస్ సోకితే వచ్చే పరిస్థితిని ముందే ఊహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏడాది పాటు సూపర్ స్టార్ బయటెక్కడా కనబడరని తెలుస్తోంది. ప్రస్తుతం రజనీ శివ దర్శకత్వంలో కమిట్ అయిన ప్రాజెక్ట్ తప్ప అధికారికంగా కమిట్ అయిన వేరే ప్రాజెక్ట్ లు ఏమీ లేవు. దీంతో దర్శక, నిర్మాతలు ఇబ్బంది పడే పరిస్థితి కూడా లేదు. అయితే పలు ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చలైతే జరుగుతున్నాయి. పేట దర్శకుడితో ఆ సినిమాకు సీక్వెల్ గా పేట-2 చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా స్ర్కిప్ట్ కూడా లాక్ అయింది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇంతలోనే కరోనా వచ్చింది. అయితే లాక్ డౌన్ సమయంలో రజనీ స్ర్కిప్ట్ లో మార్పులు చేసి తీసుకురమ్మన్నారు. ఆ మార్పులతో ఇటీవలే సదరు దర్శకుడు రజనీని కలిసి మరోసారి స్ర్కిప్ట్ వినిపించాడు. అలాగే ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజుతో కూడా ఓ సినిమా చేస్తానని ఆ మధ్య రజనీ వెల్లడించారు. అయితే లోకేష్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటం తో ఈ సినిమాకు సంబంధించి మళ్లీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ లు చేసే పరిస్థితి ఎలాగూ లేదు. థియేటర్లు కూడా ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. రీఓపెన్ అవ్వాలంటే వ్యాక్సిన్ వచ్చే వరకూ సాధ్యపడదని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.