సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావటమే గగనంగా అనిపించేది. రజనీ మూడేళ్ల పాడు గ్యాప్ తీసుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఇటీవల ఈ టాప్ స్టార్ స్పీడు పెంచారు. వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. గత ఏడాది కాలా, 2.ఓ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రజనీ ఈ ఏడాది జనవరిలో పేట సినిమాతో పలకరించారు.తరువాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం దర్బార్ షూటింగ్లో బిజీగా ఉన్న రజనీ తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీ సినిమా చేయబోతున్నారట.
అజిత్ హీరోగా వరుసగా నాలుగు సినిమాలు రూపొందించిన శివ, ఇటీవల సూర్య హీరోగా సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రజనీతో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను ధనుష్ లేదా కలైపులి యస్. థానులలో ఒకరు నిర్మించనున్నారట. అయితే ఈ లోగా అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైతే రజనీ సినిమాలన్ని ఆగిపోతాయన్న టాక్ కూడా వినిపిస్తోంది.