సూపర్ స్టార్ రజనీకాంత్.. తమిళనాట సినీ అభిమానులకు ఆరాధ్య దైవం. తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి.. ఇలా చాలామంది సినిమా బ్యాక్‌గ్రౌండ్ వున్న ప్రముఖులు తమిళనాడు రాజకీయాల్ని శాసించారు. చాలామంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో మంచి పొజిషన్‌లో వున్నారక్కడ. దేశంలో ఇంకెక్కడా కన్పించనంత ఎక్కువ సినీ ప్రభావం, తమిళ రాజకీయాల్లో కనిపిస్తుంటుంది. రజనీకాంత్ కూడా అలాగే, తమిళ రాజకీయ తెరపై వెలిగిపోతాడని అంతా అనుకున్నారు. కానీ, ‘తుస్సు’మనిపించేశారు రజనీకాంత్, రాజకీయాల్లోకి రాకుండానే. ఊరించి ఊస్సూరుమనిపిస్తే, ఆ బాధ ఎలా వుంటుందో రజనీకాంత్ అభిమానులు గతంలోనే పలుసార్లు చవిచూసేశారు. ఇప్పుడు ఇంకోసారి తీరిగ్గా బాధపడుతున్నారు. ఈసారి ఇంకాస్త ఆగ్రహావేశాలతో రజనీకాంత్ దిష్టిబొమ్మల్నీ తగలబెట్టేస్తున్నారు. ఇంతకీ, రజనీకాంత్ ‘లెక్క’ ఎక్కడ తప్పింది.? దీనికి సంబంధించి భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి.
‘సన్నిహితుల సూచనలతో, అనారోగ్య కారణాలతో మాత్రమే రాజకీయాల్లోకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను..’ అంటూ రజనీకాంత్ ఓ స్టేట్‌మెంట్ ఇటీవల విడుదల చేసిన విషయం విదితమే. దాంతో సెగ రగిలింది. ‘చాలా మంచి నిర్ణయం’ అని మోహన్‌బాబు లాంటి కొందరు సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘నేను ముందే చెప్పాను.. సినిమా వేరు, రాజకీయం వేరు.. తెలివైన నిర్ణయం రజనీకాంత్ తీసుకున్నారు..’ అంటూ కొందరు తమిళ సినీ ప్రముఖులు రజనీకాంత్ మీద సెటైర్లు వేస్తున్నారు. కాగా, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తాజా రాజకీయ సమీకరణాల్ని బేరీజు వేసుకున్న రజనీకాంత్, ఆ లెక్కల్లో తన పేరు చాలా దిగువన వుండడం చూసే, రాజకీయాల్లోకి వెళ్ళకూడదనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయమై బీజేపీ అధినాయకత్వం కూడా రజనీకాంత్‌కి ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చిందని అంటున్నారు. ‘ఈ వయసులో ఇదంతా అవసరమా.?’ అని బీజేపీకి చెందిన ఓ పెద్ద నాయకుడు (చాలా పెద్ద పొజిషన్‌లో వున్న వ్యక్తి అట..) రజనీకాంత్‌ని పరామర్శించే క్రమంలో క్లాస్ తీసుకున్నారన్నది తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ‘స్థానికేతరుడు’ అన్న కోణంలో రజనీకాంత్ పట్ల గ్రౌండ్ లెవల్‌లో రాజకీయంగా చాలా వ్యతిరేకత వుందన్న విషయాన్నీ కమలనాథులే రజనీకాంత్ దృష్టికి తీసుకెళ్ళారట. వీటన్నిటికీ తోడు, అనారోగ్య సమస్యలూ రజనీకాంత్‌ని రాజకీయంగా ముందడుగు వేయకుండా చేశాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!