సూపర్ స్టార్ రజినీకాంత్ రిటైర్మెంట్ మీద ఇప్పటికే పలుమార్లు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కూడ ఇదే అంశం మీద సోషల్ మీడియాలో మరోసారి చర్చకు వచ్చింది. రజినీ త్వరలో రిటైర్ కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ ‘అన్నాత్తే’ చిత్రం చేస్తున్నారు. శివ ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ చిత్రానికి సంబంధించి రజినీకాంత్ తన పనులన్నీ ముగించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇంకొద్ది రోజుల్లో ఇండియాకు తిరిగిరానున్నారు. మరి వచ్చాక ఆయన ఏ సినిమా చేస్తారు అనే విషయమై ఇంకా ఎలాంటి ఆఫీషియల్ క్లారిటీ లేదు.
తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాటల మేరకు రజినీకాంత్ ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తారని తెలుస్తోంది. అది కూడ తన కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలోనే చేస్తారట. ఆ సినిమా తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారట.
సౌందర్య రజినీకాంత్ గతంలో రజినీతో ‘కొచ్చాడయాన్’ అనే సినిమా చేయడం జరిగింది. భారీ వ్యయంతో నిర్మితమైన ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందింది. అప్పటి నుండి ఆమె మెగా ఫోన్ పట్టలేదు.
మళ్లీ దాదాపు ఏడేళ్ల తర్వాత మరోసారి తండ్రిని డైరెక్ట్ చేయటానికి రెడీ అవుతోందట. ఇక ఇండస్ట్రీలోని చాలామంది దర్శకులు రజినీకాంత్ తిరిగివచ్చాక కథలు వినిపించాలని, డేట్స్ తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు. చూడబోతే వారి ఆశలన్నీ నీరుగారిపోయేలానే ఉన్నాయి.