సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కారణం ఆయన హెల్త్ కండిషనే. రజనీ కొన్నాళ్ల క్రితం వరకు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడ్డారు. అమెరికా వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నాక కొలుకున్నారు. అయినా ఆయన ఆరోగ్యం సున్నితంగానే ఉంది. అక్కడి వైద్యులు ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే అంత మంచిదని సలహా ఇచ్చారు. అయినా రజినీకాంత్ జనాల్లో ఉండటానికే ఇష్టపడ్డారు. రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. కానీ ఈలోపు కరోనా పుట్టుకురావడంతో సూపర్ స్టార్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. అభిమానులు నొచ్చుకుంటారని తెలిసినా కూడ రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.
పాలిటిక్స్ పక్కనపెట్టిన ఆయన సినిమాలు మాత్రం చేస్తానని అన్నారు. దీంతో ఫ్యాన్స్ కొద్దిగా శాంతించారు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలను కూడ వదిలేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ రజినీ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత ఇంకో మూడు సినిమాలు మాత్రమే చేస్తారట ఆయన. ఈ విషయాన్ని రజినీ స్వయంగా ‘అన్నాత్తే’ చిత్ర బృందానికి చెప్పారట. అంటే రజినీని ఇంకో రెండు మూడు సినిమాల్లో మాత్రమే చూడగలం. ఆతర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారట. ఇంకొద్ది రోజుల్లో ఆయన వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లనున్నారు. తిరిగి వచ్చాక ‘అన్నాత్తే’ షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు.