‘2.0’ ఆడనివ్వం…థియోటర్ వద్ద ధర్నా

ఊహించినట్లే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజే అన్ని రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఇండియాలోనే రూ73.5 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్న తేడా లేకుండా, భాషతో సంబంధం లేకుండా సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. అంతా బాగానే ఉంది కానీ కర్ణాటకలో మాత్రం ఈ సినిమాకు ఎదురు దెబ్బ తగిలేటట్లు కనపడుతోంది.

కర్ణాటకలో వటల్ నాగరాజు అనే లీడర్..బెంగుళూరు ఊర్వశి థియోటర్ వద్ద 2.0 సినిమా ఆపాలంటూ ప్రొటెస్ట్ చేసారు. తళం, తెలుగు, మళయాళం సినిమాలను కర్ణాటక లో ఇక ప్రమోట్ చేయటానికి వీళ్లేదంటూ ఆయన ఉద్యమిస్తున్నారు. ఆయన చెప్పే మాట ఏమిటంటే..కేరళలోకానీ, ఆంధ్రా,తెలంగాణా,తమిళనాడులలో ఎక్కడా కన్నడ సినిమాలు ఆడటం లేదు..రిలీజ్ చేయటం లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ల సినిమాలు రిలీజ్ చేయాలి. రిలీజ్ అయిన నెల దాకా ఇక్కడ మన రాష్ట్రంలో ఆ సినిమాలు రిలీజ్ చేయటానికి వీళ్లేదు అంటూ మీడియాకు తెలియచేసారు. అయితే ఈ విషయమై అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఏం నిర్ణయం తీసుకున్నారనే విషయం తెలియరాలేదు. 

రజినీకాంత్ శంకర్, అక్షయ్ కుమార్, ఏఆర్ రహమాన్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో డైరెక్టర్ శంకర్ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలియజేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఆడియెన్స్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాను సపోర్ట్ చేసి.. తమ కష్టాన్ని గౌరవించినందుకు మీడియాకు ధన్యవాదాలు తెలిపాడు శంకర్. ఇక.. 2.0 సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు.

మరోవైపు హిందీ వర్షన్ ఓపెనింగ్స్ కూడా అదుర్స్ అంటూ హిందీ ఫిలిం క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. సినిమా విడుదలైన రోజు హిందీలో 20.25 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు తరణ్ ట్వీట్ చేశాడు.