రంగు రంగుల సినీ ప్రపంచంలో లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. హీరోలకైనా మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావొచ్చు కానీ హీరోయిన్లకు అలా కాదు. ఒక్కసారి లైమ్ లైట్ నుండి పక్కనపెడితే కెరీర్ కష్టాల్లో పడ్డట్టే. మెల్లగా తెరమరుగు అవ్వాల్సిందే. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఫార్ములానే పక్కాగా ఫాలో అవుతున్నారు ఈ తరం హీరోయిన్లు. ఒకప్పటిలా వీళ్లకు కాజల్, శ్రియ, అనుష్క, తమన్నాల తరహాలో లాంగ్ కెరీర్ కొనసాగించగలమనే నమ్మకం లేదో ఏమో కానీ ఉన్న ఆ నాలుగు రోజులు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే మైండ్ సెట్తో వ్యవహరిస్తున్నారు.
ఒక్క హిట్ పడగానే, జనాల్లో క్రేజ్ రాగానే నిర్మాతలకు చుక్కలు చూపెట్టేలా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పద్దతిని అనేక మంది హీరోయిన్లు అవలంభించగా ఇంకో కొత్త హీరోయిన్ ఇదే తరహాలో వెళ్తోందట. ఇటీవలే విడుదలై భారీ హిట్ అందుకున్న సినిమాలో ఆమె హీరోయిన్. చిన్న వయసులోనే హీరోయిన్ అయి మొదటి సినిమానే మెగా కుటుంబం నుండి వచ్చిన డెబ్యూ హీరోతో చేసి హిట్ అందుకుంది. మాస్ ప్రేక్షకులు ఆమెను బాగా అభిమానించారు. దీంతో ఆమెకు అవకాశాలు పెరిగాయి. ఇంకేముంది మొదటి సినిమాకు అధికారికంగా 6 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్న ఆమె ప్రోత్సాహకంగా ఇంకో 25 లక్షలు అందుకుంది. దీంతో తర్వాతి సినిమాకు ఏకంగా కోటి రూపాయలు అడుగుతోందట.
కొత్తమ్మాయి, బాగుంది, ప్రేక్షకులు కనెక్ట్ అయింది అనుకుని ఆమెను అప్రోచ్ అవుతున్న నిర్మాతలు కోటి అనే మాట విని గుండెలు పట్టేసుకుంటున్నారట. కోటి సరిపెడతారా అంటే లేదు.. ఆపైన ఎన్నో అదనపు చురకలు, కొసర్లు ఉండనే ఉంటాయి. ఇలా ఒక్క సినిమాతోనే అమాంతం కోటి టచ్ చేస్తున్న ఆమెను చూసి ఓవర్ నైట్ స్టార్లు అయిపోతే ఇలానే అడుగుతారు అంటూ పెదవి విరిస్తున్నారు.