టాలీవుడ్ పై పరిస్థితి అంపశయ్యపై ఉందంటే అతిశయోక్తి కాదు. మాయదారి మహమ్మారీ ఎవరినీ వదిలిపెట్టకుండా షంటేస్తోంది. షూటింగుల్లేవ్.. థియేటర్లు తెరుచుకోవ్.. !! ఎంతో ధైన్యం నెలకొంది. పేద బీద బడుగు బక్క కార్మికుడు అనే తేడా లేకుండా అందరూ ఊపాధిని కోల్పోయారు. ముఖ్యంగా అప్పులు తెచ్చి సినిమాలు తీసే నిర్మాతలకు మాట రావడం లేదు. అప్పులపై వడ్డీల భారం అంతకంతకు పెరుగుతుంటే టెన్షన్ కూడా అంతే ఇదిగా పెరిగిపోతోంది.
చాలా కాలంగా తెలుగు సినిమాల షూటింగులకు అనుమతులు ఇవ్వాలని నిర్మాతలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసానికి మొరపెట్టుకుంటున్నా.. ఆయన నా వల్ల కాదనేస్తున్నారు. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. దీంతో షూటింగులకు అనుమతులు ఇచ్చేందుకు సతమతమవుతున్నారు. ప్రభుత్వ అనుమతి అంత సులువుగా వచ్చేట్టు లేదు. ఇక థియేటర్లు, మాల్స్ తెరవడం అన్నది అసంభవమని ఇప్పటికే కరాఖండిగానే తలసాని చెప్పారు. అయితే రాజుగారు తలుచుకుంటే కొన్ని నియమనిబంధనలు పాటిస్తూ షూటింగులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించవచ్చనేది నిర్మాతల వెర్షన్.
ఈ సంగతి చెప్పేందుకు నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసేందుకు బయల్దేరుతున్నారట ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు. హాలీవుడ్ తరహాలో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ పరిమిత క్రూతో షూటింగులు చేసుకుంటామని కేసీఆర్ ని ప్రాధేయపడనున్నారట. ఇప్పటికే పెండింగులో ఉన్న వాటి వరకూ అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరతారట. అయితే ఇప్పటివరకూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ షూటింగులకు అనుమతుల్లేవ్. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి వెసులుబాటు కల్పిస్తున్నారని ఓ ప్రచారం సాగుతోంది. పెద్ద తెర బుల్లితెర షూటింగుల్ని ఏపీలో చేసుకునేందుకు ఆయన అనుమతిస్తున్నారన్న ప్రచారం నడుమ ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసేందుకు గిల్డ్ నిర్మాతలు సిద్ధమవ్వడం చర్చకొచ్చింది. ఇంతకీ సీఎం కేసీఆర్ అనుమతులిస్తారా? అసలేం జరుగుతోందో చూడాలి.