మండలి అధ్యక్షుడికి గిల్డ్ కౌంటర్ ఏదీ?
తెలుగు సినిమా నిర్మాతల మండలి రాజకీయాల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఇక్కడ అడుగడుగునా రాజకీయాలు రాజ్యమేలుతుంటాయి. ఎవరికి వారు ఆధిపత్య పోరాటం సాగిస్తూనే ఉంటారు. మండలిలో గుత్తాధిపత్యం కోసం ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. అయితే ఈ వార్ లో మొన్న ఎన్నికల సందర్భంలో అనూహ్యంగా నిర్మాత సి.కళ్యాణ్ పై చేయి సాధించి అధ్యక్షుడు అయిపోవడంతో అది కాస్తా రసవత్తరంగా మారింది. నిర్మాతలందరిపైనా ఉక్కు పాదం మోపాలనుకున్న నిర్మాతల గిల్డ్ సపరేట్ కుంపటి వర్గాలకు అది అశనిపాతమే అయ్యింది. ఆ నలుగురు లేదా ఆ పది మందికి అది చాలా పెద్ద ఇబ్బందికరంగా మారింది.
నిర్మాతల మండలిలో సినిమాలు తీయకుండా పెత్తనం చెలాయించేవాళ్లను సహించలేని గిల్డ్ నిర్మాతలు సపరేట్ కుంపటి పెట్టుకుని టీవీ-మీడియాలకు ప్రకటనలు తమ ఇష్టానుసారం ఇచ్చుకునేలా .. తమ సంఘం ప్రతిదానిపైనా గుత్తాధిపత్యం చెలాయించేలా సిస్టమ్ ని తయారు చేసుకున్నారు. అయితే దీనిని సంఘంలోని 1200 మంది సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లందరికీ అధ్యక్షుడిగా సి.కళ్యాణ్ రకరకాల చర్చలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నిర్మాతల మండలి తరపు నుంచి ఓ మూడు టాప్ టీఆర్పీ ఉన్న వార్తా చానెళ్లు.. అలాగే ఓ పది ఫ్రీ చానెళ్లతో ఇంపార్టెంట్ ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. తక్కువ రేట్లకే ప్రకటనలు ఇచ్చుకునేలా ఈ ఒప్పందం సహకరిస్తోందట. దీనివల్ల దాదాపు 40 శాతం వరకూ యాడ్స్ ఖర్చుల భారం తగ్గనుందని తెలుస్తోంది. అలాగే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం దిగొచ్చేలా .. ప్రొజెక్షన్ పరంగా నిర్మాతలకు అదనపు భారం లేకుండా చేసేందుకు చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది. అయితే సి.కళ్యాణ్ వేసిన ఎత్తుగడకు గిల్డ్ వాళ్లు ఎలాంటి రివర్స్ ఎత్తుగడ వేస్తారు? అన్నది చూడాల్సి ఉంది. ముఖ్యంగా గిల్డ్ నిర్మాతల్ని లీడ్ తీసుకుంటున్న దిల్ రాజు దీనిపై ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.