స్టార్ హీరోల‌తో మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమాలు.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన చిత్ర నిర్మాణ సంస్థ‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న బ‌డా నిర్మాణ సంస్థ‌ల‌లో మైత్రి మూవీ మేక‌ర్స్ ఒక‌టి. నవీన్ యార్నేని, యలమంచిలి రవిశంకర్ కలిసి ప్రారంభించిన ఈ సంస్థ స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతుంది. వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ నుండి ఏదైన మూవీ వ‌స్తుందంటే జ‌నాలు ఆ చిత్రంపై అమితాస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. తొలిసారి మ‌హేష్ బాబు, శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ్రీమంతుడు అనే చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి స‌క్సెస్ సాధించిన మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ అక్క‌డ నుండి విజ‌య దుందుభి మోగిస్తుంది. ఈ నిర్మాణ సంస్థ రూపొందించిన రంగ‌స్థ‌లం, జ‌న‌తా గ్యారేజ్ , చిత్ర‌ల‌హ‌రి, మ‌త్తు వ‌ద‌లరా వంటి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ కొట్టాయి.

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో చాలా చిత్రాల‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టుల‌కు సంబంధించి కొద్ది రోజులుగా అనేక పుకార్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ త‌మ నుండి వ‌చ్చే ప్రాజెక్టుల‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. నేడు విడుద‌ల కానున్న ఉప్పెన‌తో పాటు ప‌లు సినిమాలు ఈ నిర్మాణ సంస్థ నుండి రాబోతున్నాయి. ఇందులో ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న స‌ర్కారు వారి పాట, పుష్ప కూడా ఉన్నాయి. స‌ర్కారు వారి పాట చిత్రాన్ని మ‌హేష్ బాబు హీరోగా ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్నారు. మ‌రోవైపు పుష్ప చిత్రాన్ని అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్నారు.

అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న సినిమాల విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- హ‌రీష్ శంక‌ర్ చిత్రం, నాని- వివేక్ ఆత్రేయ అంటే సుంద‌రానికి, చిరంజీవి- బాబీ చిత్రం, బాల‌కృష్ణ‌- గోపిచంద్ మ‌లినేని చిత్రం, ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ చిత్రం, విజ‌య్ దేవ‌ర‌కొండ‌- శివ నిర్వాణ చిత్రం, ప్ర‌భాస్‌తో పాన్ ఇండియా సినిమాల‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఇవ‌న్నీ స్టార్ హీరోల సినిమాలే కావ‌డంతో ప్రేక్ష‌కుల‌లో వీటిపై ఆస‌క్తి మ‌రింత పెరిగింది.