సినిమా పేరు: కలర్ ఫోటో
ప్రొడక్షన్: అమృత ప్రొడక్షన్
నటీనటులు: సుహాస్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష
స్టోరీ: సాయి రాజేశ్ నీలం
మ్యూజిక్ డైరెక్టర్: కాల బైరవ
డైరెక్టర్: సందీప్ రాజ్
రిలీజ్ డేట్: అక్టోబర్ 23, 2020.. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో
ఒక్కసారి గత సంవత్సరం దసరా టైమ్ ను రివైండ్ చేయండి. థియేటర్లు ఎలా కళకళలాడాయో కదా. ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో బాక్సీఫీసు బద్దలయ్యేది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేసేవి. థియేటర్లలో వెళ్లి సినిమా చూస్తే వచ్చే మజాయే వేరు. ఆ మజా ప్రస్తుతం లేదు. అయినప్పటికీ.. ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ప్రేక్షకుల కోరికను కాస్తోకూస్తో తీర్చుతున్నాయి. ఎంతైనా థియేటర్ థియేటరే కదా. కరోనా మహమ్మారి మన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి సినిమాలన్నీ ఓటీటీలలోనే రిలీజ్ అవుతున్నాయి. నాని వీ సినిమాతో పాటు ఒరేయ్ బుజ్జిగా, అనుష్క నిశ్శబ్దం కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. తాజాగా ఆహా ఓటీటీలో కలర్ ఫోటో అనే సినిమా రిలీజ్ అయింది. సుహాన్ తెలుసు కదా. నిజానికి ఆయన ఓ కమెడియన్. కానీ.. తొలిసారి హీరోగా సుహాన్ నటించిన సినిమా కలర్ ఫోటో. తాజాగా దసరా కానుకగా రిలీజ్ అయిన కలర్ ఫోటో ప్రేక్షకులకు నిజంగా కలర్ ఫోటోను చూపెట్టిందా? లేక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను చూపెట్టిందా? తెలుసుకోవాలంటే సినిమా కథలోని వెళ్లాల్సిందే.
సినిమా స్టోరీ ఇదే
నిజానికి ఈ సినిమా కథ ప్రస్తుతంది కాదు. 1997వ సంవత్సరంలో జరిగిన స్టోరీ అన్నమాట. ఆ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో.. మన డైరెక్టర్ కూడా సినిమాలో అటువంటి పరిస్థితులనే కల్పించారు. అంటే.. రంగస్థలం సినిమాలోలా అన్నమాట. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం దగ్గర ఉండే ఓ మారుమూల పల్లెలో ఈ సినిమా స్టోరీ ప్రారంభమవుతుంది.
జయకృష్ణ(సుహాన్).. ఓవైపు ఇంజినీరింగ్ చదువుతూనే.. మరోవైపు పాలు అమ్ముతుంటాడు. అందరిలాగే బాగా చదవాలి… మంచి ఉద్యోగం సంపాదించాలి.. తన తండ్రిని బాగా చూసుకోవాలి… అనేదే మనోడి గోల్. తన కాలేజ్ లైఫ్ అలా సాగుతుండగా… ఓరోజు కాలేజీలో కల్చరర్ రిహార్సల్స్ జరుగుతుండగా… అమ్మవారి వేషం వేసుకొని రిహార్సల్స్ చేస్తున్న దీప్తివర్మ(చాందినీ చౌదరి)ని చూస్తాడు. చూడగానే ప్రేమించేస్తాడు జయకృష్ణ.
కానీ.. ఓ భయం. తానేమో నల్లగా ఉంటాడు. ఆమె అందగత్తె. అటువంటి అందమైన అమ్మాయి తనను ప్రేమిస్తుందా? అనే భయంతో తనను దూరం నుంచే చూస్తూ ప్రేమిస్తుంటాడు. తన ప్రేమను తన మనసులోనే దాచుకుంటాడు. అయితే.. జయకృష్ణ గురించి తెలిసిన దీప్తి మాత్రం అతడిని ప్రేమిస్తుంది.
కట్ చేస్తే… దీప్తి అన్నయ్య పోలీస్ రామరాజు(సునీల్)కు ప్రేమాదోమా అంటే పడవు. అందరి అన్నల్లాగానే తన చెల్లికి కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని కలలు కంటాడు. ఇంతలోనే తన చెల్లెలు జయకృష్ణ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నట్టు తెలుసుకుంటాడు. ఎలాగోలా కృష్ణ పీడ వదిలించుకోవాలని నల్లగా ఉన్నాడని.. తనకు ఇష్టం లేదని చెబుతాడు. అంతే కాదు.. దీప్తి లేని సమయం చూసి.. కృష్ణపై దాడి చేసి కొడతాడు. అసలు.. దీప్తిని రామరాజు ఎక్కడికి పంపించాడు? కృష్ణపై దాడి చేసిన తర్వాత కృష్ణకు ఏమైంది? తర్వాత దీప్తి.. కృష్ణను కలుస్తుందా? ఇంతకీ కృష్ణ, దీప్తి ఒక్కటయ్యారా? లేదా? అనేదే ఈ సినిమాలో మిగితా స్టోరీ.
ప్లస్ పాయింట్స్
ఈ సినిమాకు దాదాపుగా అన్నీ ప్లస్ పాయింట్సే. మైనస్ పాయింట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది నిజానికి వివక్షను బేస్ చేసుకొని వచ్చిన సినిమా. నో డౌట్. ఇది ప్రేమకథే కానీ.. వర్ణ వివక్షను ఈ ప్రేమకథలో సరికొత్తగా జొప్పించి డైరెక్టర్ సఫలమయ్యాడు.
అలాగే.. హాస్యనటుడు, హీరో అయిన సునీల్ ను విలన్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఈ సినిమాలో సొల్లు సీన్స్ ఉండవు. ప్రతి సీన్ కు.. ఇంకో సీన్ తో కనెక్టివిటీ ఉంటుంది. దీంతో సినిమాను ఒక్కసారి చూడటం మొదలు పెట్టాక.. సినిమా అయిపోయేంతవరకు అక్కడి నుంచి కదలలేరు.
నటీనటులు సుహాన్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష.. తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎవ్వరూ తక్కువ కాదు. అందరూ అద్భుతంగా తమ పాత్రల్లో నటించారు. కాల భైరవ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్స్
ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ రెండే రెండు. ఒకటి సినిమాలో కొన్ని మూస ధోరణులు ఉన్నాయి. రొటీన్ సినిమా ఫార్ములానే ఈ సినిమా డైరెక్టర్ కూడా ఉపయోగించాడు.. అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. అలాగే.. సినిమా ముగింపు కూడా ఈ సినిమాకు కొంచెం మైనస్ పాయింటే.
కన్ క్లూజన్
చివరగా ఒక్కమాట చెప్పొచ్చు. ఈ సినిమా చూస్తే రొటీన్ గానే అనిపిస్తుంది కానీ.. ఈ సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. ఇది కూడా రొటీన్ ప్రేమకథే కానీ.. విభిన్నమైన కాన్సెప్ట్ ను తీసుకొని తీసిన రొటీన్ ప్రేమకథ ఇది. అయితే.. దసరా సమయంలో… వీకెండ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే.. నిర్మొహమాటంగా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ఒక క్లీన్ ప్రేమకథను ఆస్వాదించవచ్చు.