ఆఫీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ .. ఒకటే టెన్షన్ టెన్షన్
హైదరాబాద్ ని మహమ్మారీ షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రోజుకు 900 కేసుల చొప్పున నమోదవుతుంటే కేవలం హైదరాబాద్ లోనే అందులో 800కేసులు కనిపిస్తున్నాయి. 1000 కి చేరువలో ఉంది నగరం అన్న మాటే ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం విపక్షాల నుంచి ఇప్పటికే చేతులెత్తేసిందన్న తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఇక ఇలాంటి క్లిష్ఠ సమయంలో షూటింగులకు అనుమతులు కావాలంటూ ప్రభుత్వాల్ని కోరింది టాలీవుడ్. కానీ ఏం లాభం?
సినిమావాళ్లను అట్టుడికించేస్తోంది కరోనా. అగ్ర హీరోలు.. సీరియల్ హీరోలు అనే తేడా లేకుండా అందరినీ టెన్షన్ పెట్టేస్తోంది. ఇంట్లో వాళ్లకో లేక స్టాఫ్ కో ఎవరో ఒకిరికి పాజిటివ్ అని తేలడంతో ఒకటే ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న అగ్ర నటుడు.. మొన్న టీవీ నటుడు .. మరో యువనటుడు ఆందోళనలో ఉన్నారు అంటూ ప్రచారమైంది. నేడు ఒక అగ్ర నిర్మాతకు టెన్షన్ మొదలైందని తెలుస్తోంది.
దిగ్భ్రాంతికర సన్నివేశమిది. ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కం పంపిణీదారుడి వద్ద ఉన్న సిబ్బంది కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో నిర్మాత కార్యాలయాన్ని మూసివేశారని.. ఆ పరిసరాల్లో ఇతర చిత్ర కార్యాలయాలు కూడా వైరస్ బారిన పడతాయనే భయంతో మూసివేశారని ప్రచారమవుతోంది.
ఈ షాకింగ్ సంఘటన మొత్తం సినీ పరిశ్రమను మరోసారి అట్టుడికించేస్తోంది. శుభమా అని షూటింగులకు రెడీ అవుతుంటే ఇదేమి టెన్షన్? ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత, చాలా సినిమా కార్యాలయాలు తెరుచుకుని సందడి మొదలైంది. అతి కొద్ది యూనిట్లు షూటింగుల్ని తిరిగి ప్రారంభించగా.. మరికొందరు జూలై నుండి షూటింగులను ప్రారంభించాలని యోచిస్తున్నారు. చాలా మంది హీరోలు సెప్టెంబర్ వరకూ వేచిచ ఊడాలని భావిస్తుంటే అగ్ర హీరోలంతా అక్టోబర్ డిసెంబర్ వరకూ ఆగాలని చూస్తున్నారట. ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే టాలీవుడ్ లో అనిశ్చితి అంతకంతకు పెరుగుతోందనే భావించాల్సి ఉంటుంది.