‘మల్లేశం’ ట్రైలర్ రివ్యూ

పోచంపల్లి చేనేత కార్మికుడు, పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథతో బయోపిక్ ట్రైలర్ విడుదలైంది. ‘మల్లేశం’ అనే టైటిల్ తో వస్తున్న ఈ బయోపిక్ లో ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి మల్లేశం పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీనికి రాచకొండ రాజ్ దర్శకుడు, నిర్మాత. ఈయన అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పదేళ్ళ క్రితం తమిళ సినిమా నిర్మించి దెబ్బతిన్నారు. ఇప్పుడు ‘మల్లేశం’ బయోపిక్ ని తనే రాసి, దర్శకత్వం వహించి, నిర్మించారు. పూర్తిగా తెలంగాణా పల్లె వాతావరణం కన్పిస్తున్న ఈ ట్రైలర్ ప్రారంభ ముగింపుల్ని సినిమా మీద ఆసక్తి పెరిగేలా క్రియేటివ్ గా మలిచారు.

రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలాగే ప్రియదర్శి మల్లేశం పాత్రలో సినిమాలూ షికార్లూ తిరుగుతూంటాడు ఫ్రెండ్స్ నేసుకుని. పీర్ల పండగలో చీర కట్టుకుని కన్పిస్తాడు. చేనేత కుటుంబానికి చెందిన వాళ్ళింట్లో పెద్ద సమస్య వస్తుంది. అందరు చేనేత కార్మికులకి వచ్చే సమస్యే. మగ్గం నేసి నేసి మల్లేశం తల్లి భుజం ఎముకలు అరిగిపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో పట్నం వెళ్లి పోదామనుకుంటారు. అక్కడ తల్లి సమస్యే వేధిస్తూంటే దీనికేదో చేయాలనుకుంటాడు మల్లేశం. చేనేత కార్మికుల ఈ ఆరోగ్య సమస్యని తీర్చే ఆసు యంత్రాన్ని తయారు చేయాలనుకుంటాడు. ఇది చూసి ఆరో తరగతి చదివిన తనని ఇంజనీర్ అంటూ అందరూ హేళన చేస్తారు. ఆర్ధిక సాయం కూడా లభించదు. మరి మల్లేశం చేనేత కార్మికులకి వరప్రదాయిని అయిన ఆసు యంత్రాన్ని ఎలా తయారు చేశాడు? కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు పద్మశ్రీ పొందే స్థాయికి ఎలా ఎదిగాడనేది సస్పెన్స్ లో వుంచుతూ ట్రైలర్ ముగించారు.

Mallesham Theatrical Trailer I Sri Adhikari I Raj R I Priyadarshi I Ananya I Jhansi

ట్రైలర్ ప్రారంభంలో స్కూల్లో పిల్లలు చిరంజీవి సినిమా కథ చెప్పరాక చెప్పుకుంటూ వుంటే ఓ కుర్రాడు, “అరె గిట్లనారా సినిమా కథ చెప్పడం? చల్, నీకు చెప్పనికే రాదు. అరే రాజూ నువ్వు చెప్పూ” అనడం తో మల్లేశం కథ ప్రారంభమవుతుంది. ట్రైలర్ ముగింపులో మల్లేశం యంత్రాన్ని తయారు చేయడానికి స్ట్రగుల్ చేస్తూంటే ఆపి – “అసలు కథ మొదలైంది ఇప్పుడే. ఆసు మెషీన్ చేసేది ఇప్పుడే. ముందుంది మొసళ్ళ పండుగ. సినిమా చూసి దీవించుండ్రి నిండుగ’ అని ప్రియదర్శి చెప్తూంటే ముగించారు.

బయోపిక్ కంటెంట్ తో ట్రైలర్ కొత్త ప్రయత్నంగా వుంది. బయోపిక్ కి నేపధ్యం మాత్రమే చూపించి, అసలు కథకి సంబంధించిన సీన్స్ వేయకుండా, తెర మీద చూడమని ఉత్కంత రేపారు. అయితే ఓపెనింగ్ డైలాగులతో దర్శకుడు తనకి తానే లాక్ వేసుకున్నాడు. “అరె గిట్లనారా సినిమా కథ చెప్పడం? చల్, నీకు చెప్పనికే రాదు. అరే రాజూ నువ్వు చెప్పూ” అంటూ చెప్పించిన దర్శకుడు, అంత బాగా సినిమా కథ చెప్పాల్సిన టాలెంట్ ని తను కూడా ప్రదర్శించాల్సిన లాక్ వేసుకున్నాడు.

మల్లేశం భార్య పాత్రని కల్పించి పెట్టామన్నాడు దర్శకుడు. ఆ ప్రేమా పెళ్ళీ రోమాన్సూ ట్రైలర్ లో వున్నాయి. భార్య పాత్రలో అనూషా నాగళ్ల నటించింది. తల్లి పాత్ర ఝాన్సీ నటించింది. సంగీతం మార్క్ రాబిన్ నిర్వహిస్తే, ఛాయాగ్రహణం ఎస్. బాలు సమకూర్చాడు. గోరటి వెంకన్న, చంద్రబోస్, దాశరథి పాటలు రాశారు. ఈ బయోపిక్ జూన్ 21 న విడుదలవుతోంది.

―సికిందర్