రాజశేఖర్, జీవిత పై ఉన్న టాక్ నిజమే అని తేల్చాడు

రాజశేఖర్‌ సెట్ కు ఆలస్యంగా వస్తారు, జీవిత జోక్యం ఉంటుంది అని బయిట టాక్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అదే విషయాలను ఖరారు చేసి చెప్పారు దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తాజా ఇంటర్వూలో. అయితే వాటి మూలంగా తనకేమీ సమస్య రాలేదు కాబట్టి ..అది సమస్యగా పరిణిగణించలేదు అన్నారు.

తన మొదటి చిత్రం ‘అ’తో విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తన తదుపరి చిత్రం ‘కల్కి’లోనూ అదే పద్దతిలో వెళ్లారు. క్లైమాక్స్ సీన్స్ లో వచ్చే ట్విస్టులతో ఆకట్టుకున్నారు. రాజశేఖర్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ మీడియాతో ముచ్చటించారు. అందులో భాగంగా రకరకాల విషయాలపై సూటిగా సుత్తిలేకుండా మొహమాటపడకుండా చెప్పేసారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..‘‘రాజశేఖర్‌తో షూటింగ్‌కి ఆలస్యంగా వస్తారని తెలుసు. ఆయన సెట్‌కి వచ్చేముందు చేయాల్సిన పనులన్నీ చకచక చేసేసేవాణ్ని. దాంతో ఆయనతో పనిచేయడం ఇబ్బందిగా అనిపించలేదు. ఇక జీవితగారి జోక్యం అప్పుడప్పుడూ ఉంటుంది. మంచి ఎవరు చెప్పినా తీసుకోవడం నా అలవాటు. ఎవరేం చెప్పినా సినిమాకి మంచి జరగాలనే కదా? అలాగే ‘ఏం చెప్తిరి ఏం చెప్తిరి’ అనే డైలాగ్‌ పెట్టాలన్న ఆలోచన పూర్తిగా నాదే. చెప్పిన వెంటనే రాజశేఖర్‌ చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారు అన్నారు.

రివ్యూల గురించి మాట్లాడుతూ… ‘‘తొలి చిత్రం ‘అ’కి విమర్శకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ స్థాయిలో ‘కల్కి’కి రివ్యూలు రాలేదు. కాకపోతే నేను రివ్యూల కోసం ఈ సినిమా తీయలేదు. ‘కల్కి’ ఓ కమర్షియల్ చిత్రం. ఐటెమ్‌ సాంగ్ లు లాంటి ఎగస్ట్రా హంగులు ఉంటాయి. ఓ ప్రేక్షకుడిగా నాకు ఐటెమ్‌ సాంగ్ లంటే ఇష్టం ఉండదు. కానీ ఈ సినిమాకి అది అవసరం. నన్ను ‘కల్కి’ రివ్యూ రాయమంటే ‘ఐటెమ్‌ సాంగ్ అవసరమా?’ అని రాస్తానేమో. కానీ ఈ చిత్రానికి ప్రత్యేక సాంగ్ ల్లాంటి హంగులు కావాల్సిందే’’