71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఎంపిక కాగా, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి అవార్డులు అందుకున్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, VFX సూపర్‌వైజర్ జెట్టి వెంకట్ కుమార్ ‘హనుమాన్’ చిత్రానికి ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు అందుకున్నారు. అదే చిత్రానికి బెస్ట్ యాక్షన్ విభాగంలో స్టంట్ కొరియోగ్రాఫర్లు నందు, పృధ్వి జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ‘యానిమల్’ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో నేషనల్ అవార్డు అందుకున్నారు.
అవార్డులు అందుకున్న వారందరికీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

