నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన సినీ డెబ్యూ మాత్రం ఇప్పటికీ స్పష్టత లేకుండా ఉంది. ఇప్పటికే మోక్షజ్ఞ వయసు 30 దాటినా, ఇప్పటి వరకు ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. నందమూరి ఫ్యామిలీలోని హీరోలంతా 20 ఏళ్ల లోపే వెండితెరపై అడుగుపెట్టగా, మోక్షజ్ఞ మాత్రం ఇప్పటికీ వెయిట్ మోడ్‌లోనే ఉండటం అభిమానుల్లో అసహనానికి కారణమవుతోంది. బాలయ్య తన కొడుకు ఎంట్రీ విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారని తెలిసిందే. కానీ, ఓ హద్దు దాటి ఆలస్యం కావడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
ఇంతకుముందు మోక్షజ్ఞ డెబ్యూ మూవీగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ప్రకటించబడింది. పోస్టర్ విడుదల చేసి హైప్ క్రియేట్ చేసినా, ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే మళ్లీ పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 వస్తుందనే టాక్ వచ్చింది. కానీ, ఆ ప్రాజెక్ట్ కూడా ఎక్కడో నిలిచిపోయినట్లే ఉంది. బాలయ్య ఈ సినిమాలోని టెక్నికల్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని, అందుకే ఆలస్యం అవుతోందని టాక్. అయితే అభిమానులు మాత్రం ఓ క్లారిటీ కోసం తహతహలాడుతున్నారు.
ఈ నిరీక్షణ మరింత పెరగడానికి మరో కారణం, బాలయ్య తన కొడుకు ఎంట్రీపై ఎన్నో ఆశలు పెట్టుకోవడమే. ఎలాంటి సినిమా చేయాలి? ఎలా ఎంట్రీ ఇవ్వాలి? అనే విషయంలో బాలయ్య చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టారు. మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇది ఒకపక్క ప్రయోజనంగా ఉంటే, మరోపక్క ఆలస్యమవుతూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
అంతేకాదు, ఇప్పటి యూత్ హీరోలు అంతా వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను బలంగా స్థిరపరచుకుంటున్నారు. అలాంటిది మోక్షజ్ఞ ఇప్పటికీ వెయిట్ చేయడం కరెక్టా? అని నందమూరి అభిమానుల్లోనూ చర్చ నడుస్తోంది. ఆలస్యం కావడం వల్ల మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. తొందరపడి ఓ సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆపినట్లు కాకుండా, సరైన స్క్రిప్ట్‌తో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వడం బాలయ్య ప్లాన్ కావొచ్చు. కానీ, మరీ ఎక్కువ ఆలస్యం చేయడం ఎంత వరకు బాగుంటుందో చూడాలి. 2026లోనైనా మోక్షజ్ఞ ఎంట్రీ గ్యారంటీనా లేక ఇంకా లేట్ అవుతుందా? అన్నది తేలాల్సిన విషయమే.