‘2.0’టీమ్ కి భారీ షాక్!: చెప్పి మరీ దెబ్బ కొట్టారు

ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో రజనీకాంత్‌ హీరోగా రూపొందిన చిత్రం 2.o. లైకా సంస్థ సుమారు రూ.550 కోట్లతో రూపొందించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య ఈ రోజున (నవంబర్ 29న) విడుదల అయ్యింది. హిట్ టాక్ రావటంతో టీమ్ ఆనందంలో ఉండగానే దెబ్బ పడింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ చిత్రం పైరసీ ప్రింట్ బయిటకు వచ్చేసింది.

తాజాగా ‘2.0’ సినిమా పైరసీ లింకులను తమిళ్‌రాకర్స్ అనే వెబ్‌సైట్ పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. హెచ్చరించి మరీ పైరసీ లింక్ లు ఇవ్వటంతో టీమ్ కు ఏం చేయాలో అర్దం కావటం లేదు. మరో ప్రక్క ఈ పరిణామంపై రజనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీమ్ మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఆ వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సినిమా విడుదలయి కొద్ది గంటలు కూడా గడవక ముందే పైరసీ అందుబాటులోకి రావడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాదాపు 600కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించడంతో నిర్మాతలు కలెక్షన్లపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ టైమ్ లో ఇలాంటి దెబ్బ పడటం బాధాకరమే.