లేటెస్ట్ ట్రెండ్‌: OTT కాదు..  ATT దే భ‌విష్య‌త్

tollywood

                                  థియేటర్లతో ప‌నే లేని ఏటీటీ కంటెంట్

చిన్న‌ బడ్జెట్‌లో తీసే చిత్రాలకు.. కంటెంట్‌ను మాత్రమే నమ్ముకొని తీసే చిత్రాలకు ఏటీటీ మంచి వేదిక. సినిమాల‌కు ఇదో ఆల్ట‌ర్నేట్ అని అభిప్రాయ‌ప‌డుతుండ‌డం ఆస‌క్తిక‌రం. ఓటీటీ కంటెంట్ కి పెట్టాల్సినంత బ‌డ్జెట్ పెట్ట‌కుండానే ఆర్జీవీ లాంటి వాళ్లు ఈ వేదిక‌పై స‌క్సెస‌వుతుండ‌డంతో అస‌లు ఏటీటీ అంటే ఏమిటి? అన్న ఆలోచ‌న అంద‌రినీ వెంటాడుతోంది.

బిజినెస్ లేదు.. మంచి థియేటర్లు దొరకవు! అంటూ ఒక‌ప్పుడు ఇబ్బందులుండేవి. కానీ ఏటీటీకి ఆ ఇబ్బందులేవీ ఉండ‌వు. ముఖ్యంగా కథను నమ్ముకొని కొత్త వాళ్లతో సినిమాలు తీసిన వాళ్లకు ఇప్పుడు ఇదో గొప్ప వ‌రం అని చెబుతున్నారు. ఇక ఇది థియేట‌ర్ల‌కు ప‌నికొచ్చే కంటెంట్ వేరు. ఏటీటీ కంటెంట్ వేరు. ఇది థియేట‌ర్ల‌కు ప‌నికిరాని కంటెంట్ గా విభ‌జించారు. ఓటీటీ సంస్థలు వీటి వైపు కన్నెత్తి చూడవు. అందుకే ఇలాంటి చిత్రాలు ఏటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రతి  శుక్రవారం ఏటీటీలో ఓ కొత్త సినిమా విడుదలవుతోంది. కేవ‌లం శుక్ర, శని, ఆదివారాల్లో జనం చూస్తే వీరి పెట్టుబడిలో ఎంతో కొంత తిరిగి తేవాల‌న్న‌దే ఇందులో ఫార్ములా.

ఆర్జీవి వరల్డ్ .. శ్రేయాస్‌ ఈటీ.. భీమవరం టాకీస్‌ వంటి తెలుగు ఏటీటీ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవి కాకుండా డిజిటల్‌ ప్రొవైడర్‌ యుఎఫ్‌ఓ ఆగస్టు నుంచి ఏటీటీ వేదికను ప్రారంభిస్తోంది. అలాగే జియో సంస్థ కూడా  ఏటీటీ ప్రారంభించనుంది. నటుడు ఆకాశ్‌ ఈపాటికే మొదలు పెట్టారు. రాజా రవీంద్ర త్వరలో ప్రారంభించనున్నారు. తెలుగు నిర్మాతల మండలి కూడా ఏటీటీ వేదికను ప్రారంభించనుంది. దిల్ రాజు కూడా ఈ వ్యాపారంలోకి ప్రవేశించనున్నారని తెలిసింది. నటి షకీలా తను నిర్మించిన ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’ సినిమాను యాభై రూపాయల టిక్కెట్‌ పెట్టి  ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నారు.

తమ సినిమాలు అమ్ముకోలేని నిర్మాతలు సొంతంగా ఏటీటీ పెట్టుకొనే అవకాశం ఉంటుందనీ, ఇది ఖర్చు తక్కువ వ్యవహారం కావడమే కారణమని చెబుతున్నారు. చిన్న సినిమాలకు సరైన థియేటర్లు దొరకడం లేదనే సమస్య మొదటి నుంచీ ఉంది. ఆ సమస్య ఏటీటీలో ఉండదు. పైగా ఒక సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలంటే డిజిటల్‌ ప్రొవైడర్‌కు డబ్బు కట్టాలి. పబ్లిసిటీ చేసుకోవాలి ఇంత చేసినా జనం చూస్తారనే నమ్మకం లేదు. అందుకే ఇప్పుడు ఏటీటీకి అంతటి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. సామాన్యులు అయినా క్రియేట‌ర్స్ అయితే ఏటీటీ వేదిక‌పై ఎద‌గ‌డం క‌ష్ట‌మేమీ కాదు.