OTT వేదిక‌కు బూస్ట్ ఇచ్చే బిగ్ మూవీ ఏది?

                           స్క్రాప్ వ‌దిలేస్తే ఓటీటీకి బూస్ట్ ఇచ్చే బిగ్ మూవీ ఏది?

ఇన్నాళ్లు ఓటీటీ సినిమాలు చూసిన ప్రేక్ష‌కులు ఇప్ప‌టికే ఒక అభిప్రాయానికి వ‌చ్చేసి ఉండాలి. ఓటీటీలు ఉన్న‌ది కేవ‌లం స్క్రాప్ ని రిలీజ్ చేసుకునేందుకేనా? అనే అభిప్రాయం ఈపాటికే బ‌ల‌ప‌డిపోయింది. థియేట్రిక‌ల్ రిలీజ్ కి ప‌నికిరాని చెత్త‌ను ఇక్క‌డ వ‌దిలేస్తున్నారా అన్న‌ది డౌట్. ఇటీవ‌ల రిలీజైన చాలా చిన్న సినిమాలు ఓటీటీ ఆడియెన్ ని మెప్పించ‌లేక‌పోయాయి. ముఖ్యంగా తెలుగు కంటెంట్ తేలిపోవ‌డం నిరాశ‌ను మిగిల్చింది. కృష్ణ అండ్ హిజ్ లీలా ఫ‌ర్వాలేద‌నిపించినా పెంగ్విన్ లాంటి హై ఎక్స్ పెక్టేష‌న్ ఉన్న సినిమా నిరాశ‌ప‌ర‌చ‌డం ఊహించ‌నిది. స‌త్యదేవ్ న‌టించిన 47 డేస్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. మ‌రో మూడు నాలుగు సినిమాలు ఇలాగే నిరాశ‌ప‌రిచాయి. అందుకే ఇక‌పై రిలీజ‌య్యే సినిమాల‌పైనా ఓటీటీ ఆడియెన్ కి న‌మ్మ‌కం లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. అనుష్క నిశ్శ‌బ్ధం రూపంలో బిగ్ మూవీ రిలీజ్ కి వ‌స్తుంద‌నే భావించారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చారం ఉన్నా.. అది నిజం కాద‌ని నిర్మాత‌లు ఖండించారు. అలాగే మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన క్రాక్ సినిమా కూడా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది అంటూ హ‌డావుడి జ‌రిగితే .. అలాంటిదేమీ లేద‌ని ఆ వార్త‌ల్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని నిర్మాత ఠాగూర్ మ‌ధు వివ‌ర‌ణ ఇచ్చారు.

దీంతో ఇక ఓటీటీలో వేడెక్కించే కంటెంట్ ఏదీ రిలీజ్ కాద‌ని అర్థ‌మైపోయింది. ఒక ర‌కంగా తెలుగు కంటెంట్ కంటే హాలీవుడ్ స్ట‌ఫ్ బెట‌ర్ అన్న నిర్ణ‌యానికి ఆడియెన్ వ‌చ్చేశారు. అమెజాన్ .. నెట్ ప్లిక్స్ లాంటి చోట ఆంగ్ల వెబ్ సిరీస్ ల వీక్ష‌ణ‌కే పెద్ద పీట వేస్తున్నారు ఇప్ప‌టికే. ఇంకా హిందీ భాష‌తో స‌మ‌స్య లేని వాళ్లు ఎక్కువ‌గా హిందీ సినిమాలు.. వెబ్ సిరీస్ లు చూసేందుకే ఆస‌క్తిగా ఉన్నారు.

లాక్ డౌన్ త‌ర్వాత చాలా పెద్ద హిందీ చిత్రాలు ఒకదాని తరువాత ఒకటి ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. కానీ తెలుగు సినిమాలు మాత్రం రావ‌డం లేదు. ఇది ఓటీటీ ఫాలోవ‌ర్స్ ని తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగులో చిన్న సినిమాలు మాత్రమే వచ్చాయి. అలా కాకుండా బ‌డా సినిమాలు రిలీజైతేనే ఈ వేదిక‌కు బూస్ట్ ద‌క్కుతుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఓటీటీ అయినా థియేట‌ర్ అయినా క్రేజు ఉన్న సినిమా వ‌స్తేనే కిక్కు. కానీ ఇప్ప‌టికి అలా జ‌ర‌గ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లో తొలిగా ఏ పెద్ద నిర్మాత త‌మ సినిమాని ఓటీటీ వేదిక‌పై రిలీజ్ చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. నిశ్శ‌బ్ధం.. క్రాక్.. వీ.. ఇవ‌న్నీ ఓటీటీలో వ‌స్తాయని భావించినా నిర్మాత‌లు అందుకు ఏమాత్రం ఆస‌క్తిగా లేక‌పోవ‌డం విశేషం.