టిప్పర్ లారీ ఎళ్లి స్కూటర్ ని గుద్దేసినట్టు
ఆగస్టు 30న మోస్ట్ అవైటెడ్ `సాహో` రిలీజవుతోంది. ప్రస్తుతం ఏ నోట విన్నా ఈ సినిమా గురించి తప్ప ఇంకేదీ మాట్లాడడం లేదు. ఈ ఊపులో ఇతరత్రా చిన్నా చితకా సినిమాలు వచ్చినా పట్టించుకునే సీనే కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే .. చిన్న సినిమాలు చూసేకంటే.. ఆ డబ్బులు దాచుకుని `సాహో` సినిమా చూడాలని అనుకునే మాస్ జనం కూడా ఉన్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
సాహో కంటే ముందే అరడజను పైగానే సినిమాలు రిలీజవుతున్నా అసలు వీటి గురించి పట్టించుకునే నాధుడే లేడు. వీటిలో `కౌశల్య కృష్ణమూర్తి`, ఏదైనా జరగవచ్చు, నేనే కెడి నంబర్ 1, జిందా గ్యాంగ్, బాయ్, ఉండి పొరాదే, నివాసి, నీతోనే హాయ్ హాయ్, కనులు కనులు దోచేనే, హవా.. ఈనెల 23న రిలీజవుతున్నాయి. అంటే సాహో రిలీజ్ ముందు శుక్రవారం ఈ చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. వీటిలో ఐశ్వర్యా రాజేష్ నటించిన `కౌశల్య కృష్ణమూర్తి` ఔత్సాహిక క్రికెటర్ కథతో టీజర్ స్ఫూర్తివంతంగా ఉంది. భీమనేని దర్శకత్వంలో మెగా నిర్మాత కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జెర్సీ, మజిలీ తరహాలో క్యూరియాసిటీ ఉండే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత`ఏదైనా జరగవచ్చు` కథ పరంగా నవ్యత చూపిస్తారట. ఇతర సినిమాలకు అసలు బజ్ అన్నదే లేదు. పైగా టిప్పర్ లారీ ఎళ్లి స్కూటర్ ని గుద్దేసినట్టు `సాహో` దెబ్బకు జంక్షన్లు జామ్ అయిపోయాయ్. ఈ సినిమాల్ని పట్టించుకునేవాళ్లెవరో ఏమీ అర్థం కాని సన్నివేశం కనిపిస్తోంది. అసలు ఈ సినిమాల్లో ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా కనిపించడం లేదు.