నైజాం రెబ‌ల్ హీరోకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఆఫ‌ర్‌

విశ్వ‌క్ రొట్టె విరిగి నెయ్యిలో..

`వెళ్లిపోమాకే`, `ఈ న‌గ‌రానికి ఏమైంది` చిత్రాల‌తో న‌టుడిగా గుర్తింపుని సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వ‌క్ సేన్. పూర్తి స్థాయి హీరోగా ప్ర‌మోటై న‌టించిన‌ `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`తో కొంత యార‌గెన్సీని చూపించి రెబెల్‌గా కొత్త ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. ద‌ర్శ‌కుడిగా, హీరోగా ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విశ్వ‌క్‌సేన్ విమ‌ర్శ‌కుల‌పై తారా స్థాయిలో విరుచుకుప‌డి ప్ర‌తి విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. అయినా ప్ర‌తిభ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. ఈ యంగ్ ట్యాలెంటెడ్ గ‌య్ కి ప్ర‌ఖ్యాత‌ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భారీ ఆఫ‌ర్ ఇస్తోంది. త్వ‌ర‌లో విశ్వ‌క్ తో అగ్ర నిర్మాత‌ ఓ రీమేక్ సినిమాను ప్లాన్ చేస్తున్నార‌ని జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల బాలీవుడ్‌లో విభిన్న‌మైన క‌థా చిత్రాల సంఖ్య పెరిగింది. ప్ర‌యోగాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఆ వ‌రుస‌లో వ‌చ్చిన సినిమా `సోనుకి టిటూకి స్వీటీ`. కార్తిక్ ఆర్య‌న్‌, నుశ్ర‌త్ బారుచా, స‌న్నీ నిజార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని ల‌వ్ రంజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో టీ సిరీస్ సంస్థ నిర్మించింది. 30 కోట్ల‌తో నిర్మిస్తే భారీ మొత్తాల్ని రాబ‌ట్టి హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ దీన్ని విశ్వ‌క్‌సేన్‌తో రీమేక్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందు కోసం విశ్వ‌క్‌కు బారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ రీమేక్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంది.